ప్రజాశక్తి- అనంతగిరి:మండలంలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనంతగిరి ఘాట్ రోడ్డు చెరువును తలపిస్తుంది. శుక్ర, శనివారం రెండు రోజుల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అరకు ఘాట్ రోడ్డు, అనంతగిరి, బీసుపురం, కాఫీ తోటలు వద్ద భారీగా వరద నీరు చేరింది.దీంతో వాహనాలు గంటల తరబడి అక్కడ చిక్కుకున్నాయి. అనంతగిరి నుండి ములియగుడ, డముకు, టైడా, శివ లింగపురం,అరకు మండలం సుంకరమెట్ట పంచాయతీ యూ పాయింట్ నుండి ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఘాట్ రోడ్డులో వరద నీరు ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మలుపులతో కూడిన ఘాట్ రోడ్డు కావడంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎప్పుడు కొండ చరియలు విరిగి పడుతాయోని బిక్కుబిక్కుమంటూ వాహనదారులు ప్రయాణం చేశారు. దీనికి తోడు ఘాట్ రోడ్డు అంతా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఉండటంతో కాశీపట్నం నుండి అరకుకు గంట 30 నిమిషాల్లో చేరవలసి ఉన్నప్పటికీ రెండు గంటల 30 నిమిషాలు సమయం పడుతుంది. దీంతో ప్రయాణికులకు గంటల తరబడి ఆలస్యం ఏర్పడుతుంది.
పొంగి పొర్లుతున్న గెడ్డలు
మండలంలోని గత 20. రోజుల నుండి కురుస్తున్న ఏకదాటి భారీ వర్షాల కారణంగా గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గిరిజనులు గెడ్డలు దాటి వెళ్ళలేని పరిస్థితిలో ఇళ్లకే పరిమితం అవుతున్నారు. రైవాడ జలాశయం ఆనుకొని ఉన్న లుంపర్తి, ఓనుకొండ, నేలపాలెం, కడరేవు, జీవనబాడు, సరియ జలపాతం, అనంతగిరి పంచాయతీ పరిధి మర్దగుడ్డ గెడ్డ పొంగి పోవడంతో రాజుపాక, లక్ష్మీపురంతో పాటు ఆరు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాటిపూడి జలాశయనికి ఆనుకొని ఉన్న బీంపోలు, కాశీపట్నం, చిలకలగడ్డ, రొంపల్లి పంచాయతీ గ్రామాలతో పాటు విజయనగరం జిల్లా అడ్డతీగల, విజయనగరం గుర్ల గెడ్డకు ఆనుకొని ఉన్న గరుగుబిల్లి, గుమ్మకోట గ్రామాల గిరిజన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామాలకు రోడ్డు, బ్రిడ్జి వంటి సౌకర్యాలు లేకపోవడంతో గిరిజన ప్రజలకు వర్షాకాలంలో కష్టాలు తప్పడం లేదు. అనారోగ్య గురైనప్పుడు, నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు మండల కేంద్రంలోని కార్యాల యాలకు వెళ్లేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు.










