ప్రజాశక్తి-సామర్లకోట రూరల్ ఆదివారం వేకువజామున 5.45 నిమిషాల నుండి ఉదయం 7.30 నిమిషాల వరకూ సామర్లకోటలో భారీ వర్షం కురిసింది. వర్షం కురస్తున్నంత సేపు భారీ పిడుగుల శబ్ధాలు కొనసాగాయి. కొన్ని రోజులుగా వేసవి ఎండల తాపంతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షంతో ఒక్కసారిగా ఉపశమనం దొరికింది. ప్రజలు సేదతీరారు. మండల పరిధిలో దాళ్వా రైతులు తమ పంటలు ఎక్కడ పాడవుతాయోనని భయాందోళనలు వ్యక్తం చేశారు. సుమారు 28.2 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. పిడుగులు ఎక్కడ పడుతున్నాయోనన్న భయాందోళనలు ప్రజలు వ్యక్తం చేశారు. మరోవైపు పట్టణ, మండల పరిధిలో డ్రెయిన్‌లు పూడికలతో నిండిపోవడంతో రోడ్లుపై వర్షం నీరు మురుగునీరు కలిసి రోడ్లుపైకి వచ్చాయి. దీంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. మండల పరిధిలో ఎటువంటి పిడుగుపాటు ప్రమాదాలపై ఫిర్యాదులు ఏమీ అందలేదని డిప్యూటీ తహశీల్దారు ఆర్‌శ్రీనివాసు తెలిపారు.










