Aug 31,2023 00:19

గోపాలపట్నంలో సంతకాలు సేకరిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-యంత్రాంగం
అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్‌ భారాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యాన బుధవారం పలుచోట్ల సంతకాల సేకరణ చేపట్టారు.
తగరపువలస: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా సిపిఎం భీమిలి జోన్‌ కమిటీ ఆధ్వర్యాన జివిఎంసి ఒకటో వార్డు పరిధి కొత్తపేట, బంగ్లామెట్ల ప్రాంతాల్లో పార్టీ జోన్‌ కార్యదర్శి రవ్వ నరసింగరావు ఆధ్వర్యాన సంతకాలు సేకరించారు. గ్రామ, వార్డు సచివాలయం పరిపాలనా కార్యదర్శికి సంతకాలతో కూడిన వినతులు అందజేస్తామని నరసింగరావు తెలిపారు.
గోపాలపట్నం : సిపిఎం గోపాలపట్నం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన స్థానిక రైతు బజార్‌ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ జోన్‌ కార్యదర్శి బలివాడ వెంకటరావు, నాయకులు పి.సత్యనారాయణ, ఎస్‌.సత్యనారాయణ, ఆర్‌.శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.
విశాఖ కలెక్టరేట్‌ : పూర్ణా మార్కెట్‌ స్ప్రింగ్‌ రోడ్డులో ముఠా కళాసీలు సిపిఎం నాయకులు ఎం.సుబ్బారావు ఆధ్వర్యంలో విద్యుత్‌ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సంతకాల సేకరణ, పోస్టర్‌ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్‌ నాయకులు వై.రాజు మాట్లాడారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు కె.సంతోష్‌ కుమార్‌, సిఐటియు జోన్‌ కార్యదర్శి చంద్రమౌళి పాల్గొన్నారు.
అచ్యుతాపురం : సిపిఎం అచ్యుతాపురం డివిజన్‌ కన్వీనర్‌ ఆర్‌ రాము ఆధ్వర్యంలో బుధవారం పూడిమడక, తంతడి గ్రామాల్లో సమరభేరి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తంతడి రాజన్న పాలెం గ్రామాలలో బార్క్‌ సేకరించిన భూములకు పరిహారం జాబితాలు తయారీలో జరిగిన అవకతవకలపై మాట్లాడారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు చోడిపల్లి అప్పారావు, కె.సోమునాయుడు, చేపల తాతయ్య, కృష్ణ, గనగళ్ల నూకరాజు, దొడ్డమ్మ పాల్గొన్నారు.
కె.కోటపాడు : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మండలంలోని మేడిచర్ల గ్రామంలో బుధవారం సిపిఎం జిల్లా నాయకులు గండి నాయిని బాబు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎర్ర దేవుడు, పార్టీ సానుభూతిపరులు పాల్గొన్నారు.