Sep 01,2023 01:04

ప్రజాశక్తి - పెదకాకాని : పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించకుంటే ఆందోళనకు పూనుకుంటామని ప్రభుత్వాన్ని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు హెచ్చరించారు. గురువారం పెదకాకాని మండలం స్వర్ణపురి కాలనీలో విద్యుత్‌ బిల్లులను పరిశీలించి అనంతరం సిపిఎం మండల కార్యదర్శి నన్నపనేని శివాజి అద్యక్షతన సమావేశం నిర్వహించారు. రామారావు మాట్లాడుతూ సర్టుబాటు ఛార్జీలు, ట్రూఅప్‌ ఛార్జీలు, కస్టమర్‌ ఛార్జీలు పేరుతో విద్యుత్‌ బిల్లులు పెంచారని దీనికి తోడు నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక నిత్యావవసర సరుకుల ధరలు పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు ఆకాశన్నంటుతున్నాయని విమర్శించారు. మరోవైపు పేదలకు చేతినిండా పనిలేక ఆదాయాలు పెరగక దుర్భర జీవితాలు గడుపుతున్నారన్నారు. నిరుద్యోగం పెరుగుతోందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని, సిపిఎం పోరాటాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు. శివాజి మాట్లాడుతూ పెదకాకాని మండలంలోని సుందరయ్య నగర్‌, స్వర్ణపురి కాలనీ, ఎన్‌టిఆర్‌. కాలనీ, వడ్డెర కాలనీ తదితర కాలనీల్లో 20 ఏళ్లుగా పేదలు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకుని నివాసముంటున్నారని తెలిపారు. వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ సమస్యలపై ఈ నెల 4న పెదకాకాని మండల కేంద్రంలో నిర్వహించే ధర్నాకు ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు యాకోబ్‌, రామచంద్రరావు, రామారావు, ఎస్‌.కె.ఆషా పాల్గొన్నారు.
ప్రజాశక్తి - దుగ్గిరాల : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సమరభేరి ప్రచారాన్ని దుగ్గిరాల మండలంలోని ఈమని గ్రామంలో గురువారం నిర్వహించారు. తొలుత తొలుత మండల కేంద్రమైన దుగ్గిరాలలో కరపత్రాలు ఆవిష్కరించి అనంతరం ఈమనిలో ప్రచారం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయని, పెట్రోల్‌ డీజిల్‌ ధరలు విపరీతంగా పెంచారని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా నిరుద్యోగ సమస్యల పరిష్కారం చేయలేదని, ఈ తొమ్మిదేళ్లలో 7 శాతం నిరుద్యోగులు పెరిగారని తెలిపారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటుపరం చేస్తూ కార్మికులు ఉపాధి లేకుండా చేశారన్నారు. వ్యవసాయ కార్మికులకు పనులు లేని రోజుల్లో ఉపయోగకరంగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని సైతం నిధులు తగ్గించి ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఏడుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచిందని, మరోవైపు గ్రామాల్లో విపరీతంగా విద్యుత్‌ కోతలు విధిస్తోందని విమర్శించారు. ఈ అంశాలపై నాలుగో తేదీన మండల కార్యాలయం వద్ద జరిగే ధర్నాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జె.బాలరాజు, నాయకులు వై.బ్రహ్మేశ్వరరావు, కె.కోటయ్య, బాబురావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమరభేరి ప్రచారం గురువారం రత్నాల చెరువులోని సింహాద్రి శివారెడ్డి భవనం వద్ద ప్రారంభమైంది. అక్కడ నుండి రత్నాల చెరువు, పాత మంగళగిరి, టిప్పర్ల బజార్‌, భార్గవ్‌పేట తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, సీనియర్‌ నాయకులు పి.బాలకృష్ణ, పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌, నాయకులు బి.స్వామినాథ్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : పెనుమాకలో కరపత్రాలను పంపిణీ చేశారు. సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్‌కె పీరూసాహెబ్‌, పి.సత్యనారాయణ, కె.వెంకటేశ్వరరావు, ఎస్‌కె బాజీ, షార్జహాన్‌, కోటేశ్వరరావు, పి.శ్రీనివాసరావు, ఎస్‌కె మీరావలి, ఎస్‌కె రెహమాన్‌, కె.శివన్నారాయణ పాల్గొన్నారు. మస్టర్‌ పాయింట్ల వద్ద గ్రూపు సమావేశాల్లో సిఐటియు తాడేపల్లి పట్టణ కార్యదర్శి వి.దుర్గారావు మాట్లాడారు. రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వం మోడీ భజనలో తరించిపోతుందని విమర్శించారు. అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తామని, విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చిన జగన్‌ నేడు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని ఏడు సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారని, ఉచిత విద్యుత్‌కు ఎగనామం పెడుతున్నారని విమర్శించారు. ఎన్‌టిఆర్‌ కాలనీలో కరపత్రాలు పంపిణీ చేశారు. సీతానగరం, బోటుయార్డు, ఎన్‌టిఆర్‌ కట్ట, సుందరయ్య ప్రెస్‌ కాలనీ ప్రాంతాల్లో సిపిఎం నాయకులు ప్రచారం నిర్వహించారు. ఉండవల్లి సెంటర్‌, నులకపేట తదితర ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులతో జనరల్‌ బాడీ సమావేశాలు నిర్వహించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, నాయకులు ఎ.శౌరిబర్తులం, టి.బాబూరావు, కె.మేరి, వై.బర్నబస్‌, కె.రామకృష్ణ, వి.సామ్యేలు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తుళ్లూరు : వెంకటపాలెంలో ప్రచారం చేపట్టగా సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటి కార్యదర్శి ఎం రవి మాట్లాడారు. నాగరాజు, నందాజీ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - పెదనందిపాడు రూరల్‌ : మండల కేంద్రమైన పెదనందిపాడులో ఆటో ప్రచారాన్ని సిపిఎం మండల కార్యదర్శి డి.రమేష్‌బాబు ప్రారంభించి మాట్లాడారు. కాకుమాను, పెదనందిపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రచారం కొనసాగింది. శుక్రవారం సచివాలయాల వద్ద, 4న తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామని, ప్రజలు జయప్రదం చేయాలని రమేష్‌బాబు కోరారు. నాయకులు కె.శివనాగేశ్వరరావు, సిహెచ్‌.యానాదులు, ఎం.వెంకటే శ్వర్లు, డి.శ్రీనివాసరావు, కె.వెంకట శివరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-గుంటూరు : నగరంలోని పలు పేటల్లో కరపత్రాలు పంపిణీ చేసి, ప్రచారం నిర్వహించారు. స్థానిక దేవాపురం, అశోక్‌ నగర్‌, కోబాల్డ్‌పేట ప్రాంతాల్లో ప్రచారం చేట్టారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు బి.ముత్యాలరావు మాట్లాడుతూ సెప్టెంబర్‌ 1న సచివాలయాల్లో వినతులు, విద్యుత్‌ బిల్లులు దగ్గం చేయటం, 4న తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు ఎ.కళ్యాణి, బి.అంజలి, సాంబశివరావు, ఎం.వెంకట నరసయ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తాడికొండ : నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో ప్రచారం చేశారు. స్థానిక బస్టాండ్‌ వద్ద కరపత్రాల పంపిణీలో నాయకులు కె.పూర్ణచంద్రరావు మాట్లాడారు. సిహెచ్‌.భాస్కరరావు, కె.స్రవంతి, శ్రీహరిరెడ్డి, శివయ్య, ఈశ్వరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మేడికొండూరు : మండలంలోని మేడికొండూరు, తురకపాలెం గ్రామాల్లో కరపత్రాల పంపిణీ చేశారు. సిపిఎం నాయకులు బి.రామకృష్ణ మాట్లాడారు. 4వ తేదీన తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నాకు ప్రజలు తరలిరావాలని కోరారు.
ప్రజాశక్తి-తెనాలి : పట్టణంలోని 24వ వార్డు శాంతినగర్‌లో ప్రచారం చేశారు. భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించగా ఇసుక కొరతతో పనులు మందగించాయని, ఉపాధి కోల్పోతున్నామని, సంక్షేమ బోర్డుద్వారా కూడా పథకాలు లభించటంలేదని వారు నాయకుల దృష్టికి తెచ్చారు. సిపిఎం పట్టణ కార్యదర్శి బాబుప్రసాద్‌ మాట్లాడుతూ దేశంలో అదాని, అంబానిలకు దేశ సంపదను దోచిపెట్టే విధానానికి ప్రభుత్వం స్వస్థి పలకాలని, సామాన్యుల్లో కొనుగోలు శక్తిని పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌.భవన్నారాయణ, కె.రవికుమార్‌, షేక్‌ హుస్సేన్‌వలి, పి.జోనేష్‌, టి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ప్రజాశక్తి - ప్రత్తిపాడు : నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో సెంటర్‌లో సమరభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం స్థానికంగా ప్రచారం చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.లక్ష్మణరావు మాట్లాడారు. నాయకులు కె.ఆదినారాయణ, రాజు, శ్రీనివాసరావు, వెంకట్‌, ఎస్‌కె.బాబు పాల్గొన్నారు.