Oct 06,2023 23:58

పాదయాత్రలో అభివాదం చేస్తున్న సిహెచ్‌ బాబూరావు, పాశం రామారావు తదితరులు

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : ప్రజలపై అధిక భారాలు వేసే విధానాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తుండగా వాటిని రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం తూచ తప్పకుండా పాటిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు విమర్శించారు. ఈ విధానాలను ప్రజలు పోరాటాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర నాలుగో రోజైన శుక్రవారం ఎంటిఎంసి పరిధిలోని గుండిమెడ నుండి ప్రారంభమై చిర్రావూరు, మెల్లంపూడి గ్రామాల్లో కొనసాగింది. పలు సమస్యలపై ఆయా గ్రామాల ప్రజలు పాదయాత్ర బృందానికి వితిపత్రాలు ఇవ్వడంతోపాటు తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. పాదయాత్రను ప్రారంభించిన బాబూరావు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక రాజధానిలో ఇళ్లులేని ప్రతి పేదవాడికీ ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తామని నమ్మించిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఏ ఒక్క పేదవాడికీ సెంటు భూమి ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాజకీయ చేస్తుందే గాని ప్రజల అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదన్నారు. తాడేపల్లి మండలంలోని పలు గ్రామాలను మున్సిపల్‌ కార్పొరేషన్‌ పేరుతో విలీనం చేశాక అభివృద్ధి చేసిందేమీ లేదని, ప్రజలపై పన్నుల భారాలు మాత్రం ఎక్కువయ్యాయని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలపై చెత్తపన్ను, నీటి పన్ను అంటూ భారాన్ని పెంచారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కోకొల్లలుగా సమస్యలున్నాయని, వాటి పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల వర్షాలప్పుడు ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచి దుర్గంధం వెదజల్లుతోందన్నారు.
సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ తాడేపల్లి మండలంలో రైతులు ప్రధానంగా మురుగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఆంధ్రరత్న పంపింగ్‌ స్కీమ్‌ పంట కాల్వలో చుట్టుపక్కల ప్రాంతాల ఇళ్లల్లోని వ్యర్థపు నీరు కలుస్తోందని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పొలాల్లోకి మురుగునీరు చేరి పంట దిగుబడులు దెబ్బతింటున్నారని, పొలాన్నీ బీళ్లుగా మారుతున్నాయని చెప్పారు. అధిక వర్షాలప్పుడు పొలాల్లోకి చేరిన వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక రోజుల తరబడి పొలాల్లోనే నిలిచి పైర్లు దెబ్బతింటున్నాయని, పొలాల్లోని నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మండలంలోని కౌల్దార్లందరికీ గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలని, అధిక వర్షాల వల్ల నష్టపోయిన లంక పొలాల రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పులు చేయాలి
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్‌ :
నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పులు చేయకపోవడం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సమస్యగా మారిందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. ప్రజా చైతన్య యాత్ర మండలంలోని నూతక్కిలో పర్యటించిన సందర్భంగా పలు సమస్యలను స్థానికులు పాదయాత్ర బృందం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ పేదలు నివాసం ఉంటున్న ఇళ్లకు పట్టాలివ్వాలని, ఇళ్లులేని వారికి స్థలమిచ్చి ప్రక్కా ఇళ్లు నిర్మిస్తామనే హామీని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. పైగా కాల్వ కట్టల సుందరీకరణ పేరుతో పేదల ఇళ్ల తొలగింపునకు పూనుకుందోని విమర్శించారు. మతోన్మాద బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పేదల పక్షాన ఎర్రజెండా నిలబడుతుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తున్నామని చెప్పారు. పాదయాత్రలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రవి, ఎస్‌ఎస్‌ చెంగయ్య, ఇ.అప్పారావు, సీనియర్‌ నాయకులు జొన్నా శివశంకరరావు, జిల్లా నాయకులు కె.అజరుకుమార్‌, మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి, నాయకులు ఎ.రంగారావు, కె.వెంకటేశ్వరరావు, పి.కృష్ణ, బి.సంసోను, వి.వెంకటేశ్వరరావు, ఎం.భాగ్యరాజు, జె.నవీన్‌, ఎం.పాములు, పి.సుబ్బారావు, బి.గోపాలరావు, కె.జేమ్స్‌, కె.సాంబశివరావు, వై.కమలాకర్‌, పి.ప్రసాద్‌, వి.భారతి, జానారెడ్డి, సుగుణకుమార్‌, సిహెచ్‌.బ్రహ్మారెడ్డి, ఎం.బాలాజి, డి.శ్రీను పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజానాట్య మండలి కళకారులు తమ గేయాలతో ఉత్సాహపరిచారు.