ప్రజాశక్తి -సీలేరు
భానుడు భగభగ మండిపోయాడు. సూర్య ప్రతాపంతో జీకే వీధి మండలం సీలేరులో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. నాలుగు రోజుల నుంచి ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది. మంగళవారం 35 నుంచి 37 మధ్యలో ఉష్ణోగ్రతల నమోదు కాగా, బుధవారం దాదాపు 38 డిగ్రీలు నమోదైంది. గురువారం ఉదయం నుంచి ఎండ తీవ్రత మరింత అధికమై ఉదయం 11 గంటలకే 36 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. క్రమేపి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 40 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకోవడంతో ఎండ వేడిమికి తాళలేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వ్యాపారులు ఎండకి తట్టుకోలేక కాటన్ దుస్తులను తడిపి దుకాణాల ముందు వేలాడదీశారు. ఎండ వేడిమికి తాళలేక జనం బయటకు రాలేదు. దీంతో సీలేరు మార్కెట్ రోడ్డు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారింది. మారుమూల ప్రాంతాల గిరిజనులు సమీప అటవీ ప్రాంతంలో పచ్చని చెట్లు కింద సేద తీరుతూ వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటికొచ్చారు. ముందు ముందు ఎండలు మరింత అధికంగా ఉంటాయని వార్తలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
మరో ఐదు రోజులు అధిక ఉష్ణోగ్రతలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ వాతావరణ నోడల్ అధికారి డాక్టర్ ఎం సురేష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రత 38.8 నుంచి 45.8 డిగ్రీల వరకు నమోదు కావచ్చని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.










