ప్రజాశక్తి -సీలేరు
జీకే వీధి మండలం సీలేరులో ఆదివారం భానుడు భగభగ మండిపోయాడు. 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. గత నెల రోజులుగా సీలేరులో ఉష్ణోగ్రతల్లో 34, 35, 36, 37, 38, డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు అవుతూ ఉండేది. ఆదివారం ఉదయం నుండి సూర్యుడు తన ప్రతాపం చూపించడంతో మునుపు ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రత తీవ్రతరమైంది. దీంతో మధ్యాహ్నం ఒంటిగంటకు 36, 37, 38, డిగ్రీ మధ్య ఉష్ణోగ్రత నమోదు కాగా క్రమేపీ సాయంత్రం ఐదు గంటలకు 40 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకుంది. ఎండ ప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటికి వచ్చేందుకు సాహసించలేదు. సీలేరు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు పచ్చని చెట్లు కింద సేదతీరి ఉష్ణోగ్రత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఎండ, వేడి, గాల్పులు కారణంగా ఆదివారం వారపు సంతకు మారుమూల ప్రాంతాల నుంచి గిరిజనులు పెద్దగా రాలేదు. మారుమూల గిరిజన గ్రామాల నుంచి గిరిజనులు కొంతమంది, మైదాన ప్రాంతం నుంచి ఒకరిద్దరు కూరగాయలు తెచ్చి ఆరకొరగా విక్రయించారు. ఇటు కొనుగోలుదారులు, అటు వ్యాపారులు పెద్దగా రాకపోవడంతో వారపు సంత బోసిపోయింది. వచ్చిన వారు కూరగాయలు కూడా అంతంత మాత్రమే కొనుగోలు చేసుకొని ఎండ వేడి మికి తాళలేక ఇంటిదారి పట్టారు. దీంతో సీలేరులో వారపు సంత కళతప్పింది.










