Sep 08,2023 09:22

             కొత్తపేట పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో మాధవరావు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చి పాఠశాల స్థాయిలో మొదటి స్థానంలో వచ్చిన విద్యార్థికి ఉత్తమ విద్యార్థి పురస్కారం ఇవ్వడం ఆ స్కూలు ఆనవాయితీ. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో రాజు, రాము, గోపీకి ఒకే మార్కులు వచ్చాయి. ఎవరికి ఉత్తమ విద్యార్థి పురస్కారం ఇవ్వాలో అర్థం కాలేదు. తోటి ఉపాధ్యాయుల సలహాలను తీసుకుందామని సమావేశం ఏర్పాటు చేశారు మాధవరావు. వారం రోజుల పాటు ముగ్గురు విద్యార్థులను ఉదయం ఉద్యానవనంలో మొక్కలకు నీళ్ళు పోయాలి. మధ్యాహ్నం వృద్ధాశ్రమం భోజనం సమయంలో పాల్గొనాలి. సాయంత్రం గ్రంథాలయాన్ని సందర్శించాలి. ఈ మూడు కార్యక్రమాలు ఎవరైతే క్రమం తప్పకుండా చేస్తారో వారిని ఉత్తమ విద్యార్థిగా ఎన్నుకుందామని మాస్టార్లందరూ తీర్మానించారు.
          వారం రోజులు గడిచాయి. మళ్లీ ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేశారు. 'మనం అనుకున్నట్టుగానే ముగ్గురు విద్యార్థులు మూడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాము మాత్రమే ఉత్తమ విద్యార్థికి అర్హత సాధించాడు' అని అన్నారు హెచ్‌ఎం. 'ముగ్గురూ హాజరైతే రాము ఒక్కడే ఎలా అర్హత సాధించాడు సార్‌' కుతూహలంతో అడిగారు మిగిలిన మాస్టార్లు.
            ''వారికి అప్పజెప్పిన పనులను నేనే స్వయంగా పర్యవేక్షించాను. అప్పుడే ఎవరు మనసుపెట్టి చేశారో తెలిసింది. రాము మాత్రమే మొక్కలకి నీళ్ళు పోయడమే కాక, ఎండిన ఆకులు ఏరుతూ, పాదులు చేస్తూ, ఉద్యానవనాన్ని శుభ్రం చేశాడు. మధ్యాహ్నం వృద్ధాశ్రమంలో కూడా భోజనాలు పెడుతూ, అందరితో ప్రేమగా గడిపాడు. గ్రంథాలయంలో కూడా ఎంతో శ్రద్ధగా కథలు, విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను చదువుతూ ముఖ్యమైన విషయాలను పుస్తకంలో రాసుకునేవాడు. బట్టీ పట్టి మార్కులు తెచ్చుకోవడం తెలివికీ, విలువలకూ కొలమానం కాదు. పెద్దల పట్ల ప్రేమ, దయ, మొక్కలను పరిరక్షించడం, పర్యావరణంపై బాధ్యత, పుస్తకాలను విజ్ఞానం కోసం ఉపయోగించుకోవాలనే ఉత్సుకత చదువుతో పాటు ప్రతి విద్యార్థికి ఉండాలి. అవి రాములో ఉన్నాయని నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ ఏడాది పాఠశాల ఉత్తమ విద్యార్థి రాము అని ప్రకటిస్తున్నాను' అని మాధవరావు చెప్పగానే సహ ఉపాధ్యాయులు అందరూ చప్పట్లు కొట్టారు.

-కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం
9441791239