విజయ్ చదువుతున్న ఎనిమిదో తరగతిలోకి కొత్తగా ప్రవేశం పొందాడు కార్తీక్. స్థూలకాయంతో ఉన్న కార్తీక్‌ని చూసి విద్యార్థులందరూ
గేలి చేసేవారు, ఆట పట్టించే వారు. అయినా కార్తీక్ ఏమీ అనే వాడు కాదు. కార్తీక్ పక్కనే విజయ్ కూర్చొనేవాడు. కొన్ని రోజుల్లోనే వారిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. క్లాసులో పిల్లలందరూ కార్తీక్‌ను అలా గేలి చేస్తుంటే విజయ్ చాలా బాధపడేవాడు.
ఓ రోజు లంచ్ టైంలో 'కార్తీక్ నిన్ను అందరూ మారు పేరుతో పిలుస్తుంటే నీకు బాధ అనిపించడం లేదా' అని అడిగాడు. దానికి కార్తీక్ 'బాధ ఎందుకు? నేను లావుగా ఉన్నాను కాబట్టే వారు అలా అంటున్నారు. వారు అంటున్నారని నేను కూడా ఎదురుతిరిగితే స్నేహం ఎలా కుదురుతుంది? స్నేహితుల మధ్య కోపాలు ఉండకూడదు. నిదానంగా వారే అర్థం చేసుకుంటారులే' అని సమాధానం చెప్పాడు. ఆ మాటలకు విజయ్ ఆశ్చర్యపోయాడు.
ఆ రోజు విజయ్ పుట్టిన రోజు అందరికీ చాక్లెట్స్ పంచుతూ ఉంటే ముగ్గురికి తక్కువ వచ్చాయి. అప్పుడు కార్తీక్, విజయ్ దగ్గరకు వచ్చి 'నువ్వు నాకు ఇచ్చిన చాక్లెట్స్ తీసుకో. వాళ్ళకు పంచు' అని తిరిగి ఇచ్చేశాడు. ఆ చాక్లెట్లంటే కార్తీక్‌కి చాలా ఇష్టం. అందరిముందూ తాను అవమాన పడకూడదనుకుని అలా చేశాడని విజరు గ్రహించాడు. అతని మంచి మనసుకు గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితుని గొప్పతనం గురించి తోటి విద్యార్థులకు కూడా చెప్పాడు. 'చూశారా ఫ్రెండ్స్, కార్తీక్ మంచి మనసు.. ఎప్పుడూ ఎవరూ బాధపడకూడదని అనుకుంటాడు. అటువంటి వాడిని మీరు రోజూ గేలి చేస్తున్నారు. వీడు మన స్నేహితుడు. మనం అందరం కలసి ఉండాలి. చక్కగా పేర్లతో పిలుచుకోవాలి' అన్నాడు. విజరు మాటలకు అందరూ తల వంచుకున్నారు 'సారీ కార్తీక్' అన్నారు. కార్తీక్ కళ్ళల్లోంచి ఆనందభాష్పాలు రాలాయి. ఆ రోజు నుంచి అందరూ కార్తీక్‌తో స్నేహంగా ఉన్నారు.
- కనుమ ఎల్లారెడ్డి, 93915 23027.










