Jul 23,2021 12:23

బెంగళూరు : కర్నాటక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొన్నాళ్లుగా సిఎం మార్పుపై కొనసాగుతున్న సందిగ్థతకు సిఎం యడియూరప్ప తెరదించారు. గురువారం బెంగళూరు విధానసౌధ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తాను సిఎం పదవికి రాజీనామాను చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బిజెపి వర్గాల సమాచారం మేరకు వచ్చే సోమవారం రెండేళ్ల పాలనపై సభ కాగానే.. యడియూరప్ప రాజభవన్‌కు నేరుగా వెళ్లి గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించనున్నారు. యడియూరప్ప స్థానంలో పార్టీలోని సీనియర్‌ నాయకుడిని అధిష్టానం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

అధిష్ఠానం సూచించినట్లుగా నడుచుకుంటాను : యడియూరప్ప
''ఈనెల 26న రెండేళ్ల పాలనపై సాధన సమావేశం నిర్వహిస్తాం. ఆపై అధిష్ఠానం సూచించినట్లుగా నడుచుకుంటాను. 75 ఏళ్లు పైబడిన వారికి కీలక పదవులలో కొనసాగించే సంప్రదాయం బిజెపి లో లేదు. అయితే, నాకోసం రెండేళ్లపాటు పెద్దలు వెసులుబాటు ఇచ్చారు. దీనిపై ఎవరూ ఆందోళనలు చేయొద్దు'' అని యడియూరప్ప పేర్కొన్నారు.

సిఎం పగ్గాలు ఎవరికి ?
ముఖ్యమంత్రి పగ్గాలను ఎవరు పట్టనున్నారనే విషయమై పలువురు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి సీటీ రవితో పాటు రాష్ట్ర మంత్రులు మురుగేశ్‌ నిరాణి, ఉపముఖ్యమంత్రి సిఎన్‌ అశ్వత్థనారాయణ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. లింగాయత సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వదలచుకుంటే మురుగేశ్‌ నిరాణికి అవకాశం ఇస్తారని కొందరు చెప్పుకుంటున్నారు. ప్రహ్లాద్‌ జోషి లేక సీటీ రవిలో ఒకరిని సిఎం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. మరి సిఎం రేసులో ఎవరు పగ్గాలు పట్టనున్నారో వేచిచూడాలి.