మంగళగిరి: స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవ స్థానానికి సంబంధించిన చారిత్రాత్మక కళ్యాణ పుష్కరిణి (పెద కోనేరు) పునర్వైభవం తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంత రావులు పేర్కొన్నారు. కోనేరు అభివృద్ధి పనుల్లో భాగంగా అడుగు భాగం పూడికతీత పనుల్లో 1870-1890 మధ్య కాలం నాటి కి చెందిన బంగారు, రాగి నాణేలతో పాటు స్వామి వారి పూజా సామాగ్రి బయటపడ్డాయి. ఈ సంద ర్భంగా వాటిని శుక్రవారం ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులు పరిశీలించారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ బంగారు, రాగి నాణేలతో పాటు పూజా సామాగ్రిని తహశీల్దార్‌కు అప్పగించినట్లు చెప్పారు. కళ్యాణ పుష్కరిణి (పెద కోనేరు) పనులు గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభించడం జరిగిందని, తొలినాళ్లలో మురికి నీటితో నిండిపోయి ఉన్న కోనేరును శుభ్ర పర్చడం జరిగినట్లు చెప్పారు. సుమారు 150 రెండు అడుగుల లోతు వరకు కోనేటిలో పూడిక తీసినట్లు చెప్పారు. అడుగుభాగం నుంచి పై వరకు మెట్లు నిర్మాణం జరిగిందన్నారు. రెండు మూడు రోజుల్లో దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కోనేరు దిగువ భాగం నుంచి పునరుద్ధరించేందుకు తగు కార్యా చరణ ప్రణాళికలు రూపొందించనున్నట్లు చెప్పారు. రానున్న మరో నాలుగు ఐదు నెలల్లో పూర్తి స్థాయిలో కళ్యాణ పుష్కరిణి పునరు ద్ధరణ పనులు పూర్తి చేసి అందు బాటులోకి తీసు కువస్తామని స్పష్టం చేశారు. నగరంలో బాలాంబ సత్రాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి డిసెంబరు చివరి నాటికి భక్తులకు అన్నదాన కార్యక్రమం తిరిగి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రెవెన్యూ చట్ట ప్రకారం అతి త్వరలోనే బాలాంబ సత్రం స్థలం ప్రభుత్వానికి అధీనం అయిన తర్వాత ఎండోమెంట్ శాఖకు బదలాయింపు చేసుకుని సత్రాన్ని నిర్మిస్తామని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ జీవీ రామ్ ప్రసాద్, పట్టణ సీఐ బి. అంకమ్మ రావు, దేవస్థాన ఈఓ ఎ.రామకోటిరెడ్డి, జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు ఎం.మల్లేశ్వరరావు, పట్టణ జేసీఎస్ కన్వీనర్ ఎండి ఫిరోజ్, నాయకులు ఎ.రాజేష్, ఎస్. బాలాజీ గుప్తా, బి. నర్సయ్య, బి.రాజారావు తదితరులు పాల్గొన్నారు.










