చీటికీ మాటికీ
చికాకు లేస్తుంది
ఎదుటోళ్ల నడవడో
నేను తడబడో
ఏదో తప్పైతే
అలవోకగా అసంకల్పితంగా
జరిగిపోతాంది
చూస్తున్న వేషమో
వస్తున్న ఆవేశమో
తేటతెల్లంగా చెప్పలేను కానీ
ఓ ముప్పైతే ముంచుకొస్తుంది
అది తప్పేనని తెలుసుకునే వరకూ
తప్పుటడుగులోనే
ఈ బురద గుంటలో బొర్లటం
నాకుసుతరాం ఇష్టంలేదు
ఎవరైనా ఒక్కటి తెలుసుకోవాలి
సమూహంతో నడవాలంటే
నడకొస్తే సరిపోదు
కాస్త లౌక్యం వుండాలి
కాసింత త్యాగం వుండాలి
కొంత తోడుపెట్టే మనసుండాలి
కొంచమైనా కలుపుకునే నేతృత్వముండాలి
కొద్దిగైనా నమ్ముకునే నైతికత వుండాలి
అర్థం పర్థం లేకుండా
తలవంచుకుని
గొర్రె వెనుక గొర్రెలా
పోతుంటే ఎట్లా చెప్పు
నాకేమో ఈ విధి విధానం పడదు
మీకేమో ఈ కాలాన్ని దొర్లించటం
పెద్ద కళలా కనిపిస్తోంది
ఎంతైనా మీరు
బతకనేర్చినోళ్లు బాసూ
మోచేతివో మోకాలువో
ఏ నీళ్లయినా తలవంచుకు తాగేస్తారు
నాకస్సలు ఒంట పట్టని పని
ఇసుమంతైనా కంట గిట్టని పని
ఈ చావుకూ బతుక్కూ మధ్య
సంకెళ్లు పడితే పడనీ
ఎన్నిసార్లయినా తెంచుకునే స్వరమే నాది
బానిసత్వంలోనూ
స్వేచ్ఛుందని విర్రవీగే వెర్రివాళ్లతో
నేను కలువను గాక కలువను
మీతో ఇంతకాలం
ఒకడిగా చరించినందుకు
కొంతదూరం సంచరించినందుకు
నాకు నేనే పశ్చత్తాప పడుతున్న
ఈ క్షణమే ఇప్పుడే
ఈ గంపను ఎత్తేసి
ఈ గుంపులోంచి
ఈ ఉచ్చులోంచి
ఈ రొచ్చులోంచి
బయటకు దూకుతున్నా..!
డా.కటుకోఝ్వల రమేష్
99490 83327