ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బయో పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ముసుగులో అనేక నకిలీ కంపెనీల ఉత్పత్తులు యథేశ్చగా మార్కెట్‌లోకి వస్తున్నాయి. గత కొన్ని ఏళ్లుగా బయో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీనిని ఆసరాగా చేసుకొని పలువురు నకిలీ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకు వస్తున్నారు. అసలు కంపెనీలకు ధీటుగా నకిలీ ఉత్పత్తులతో రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రస్తుతం 100 కంపెనీలకు చెందిన 500 బయో ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. కొన్ని కంపెనీలకు అనుమతి లేకుండానే ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో బయో ఉత్పత్తుల విక్రయాలు రూ. 500 కోట్ల వరకు వ్యాపారం జరుగుతోంది. గుంటూరు,పల్నాడు జిల్లాల్లో రూ.200 కోట్ల వరకు బయో నకిలీ ఉత్పత్తుల వ్యాపారం సాగుతోంది. పల్నాడు, గుంటూరు జిల్లాలో వాణిజ్య పంటలు ఎక్కువగా పండించడం వల్ల ఎరువులు, పురుగు మందుల వినియోగం కూడా ఎక్కువగా ఉంటోంది. గుంటూరు పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న నకిలీ ఉత్పత్తులు ఎక్కువగా గుంటూరు, పల్నాడు జిల్లాలకు వస్తున్నాయి. నకిలీ బయో పెస్టిసైడ్స్ వినియోగం వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. బయో ఉత్పత్తుల్లో ఎక్కువగా జిబ్రా లిక్ యాసిడ్ కలపడం వల్ల కాపు ఏపుగా పెరిగినా దిగుబడి రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పంట నాణ్యత కూడా తగ్గుతుంది. క్రిమి సంహారక మందులు, ఎరువుల నియంత్రణ చట్టాల పరిధిలోకి బయో ఉత్పత్తులు రావని కొన్ని కంపెనీల వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ ఉత్పత్తుల విక్రయాన్ని నిరాటకంగా కొనసాగిస్తున్నారు. బయో ఉత్పత్తుల వినియోగం వల్ల భూమిలో భూసారం తగ్గి చౌడు భూములుగా మారతాయి. పర్యావరణానికి హాని కలుగుతుంది పురుగుమందుల అవశేషాలు గాలిలో కలిసి వాయుకాలుష్యం ఏర్పడుతుంది. ఇందువల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుంది. ఒక కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకోగా పేరు మార్చి పరిసరాల్లోనే మరో కంపెనీని ప్రారంభించడం బయో ఉత్పత్తుల తయారీదారులకు పరిపాటిగా మారింది. విజిలెన్సు, వ్యవసాయ శాఖ, పోలీసు అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా పూర్తిస్థాయిలో నిరోధించలేకపోతున్నారు. గ్రామాల్లో ఎరువులు, పురుగుమందుల దుకాణాల వారు రైతుల ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకుని డిఎపి, యూరియా కొనుగోలు సమయంలో బయోలు కూడా కొనుగోలు చేయాలని షరతు పెడుతున్నారు. బయో కంపెనీలు ఇచ్చే బంపర్ ఆఫర్లతో వ్యాపారులు రైతులకు వీటిని ఇట్టే అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అప్పులు చేసి ఎరువులు, పురుగు మందులు తీసుకునే వారికి వీటిని పూర్తిస్థాయిలో అంటగడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటి నియంత్రణకు చట్టం చేయాలని గతంలో హైకోర్టు సూచించినా ప్రభుత్వం ఇంత వరకు తగిన చర్యలు తీసుకోలేదు.










