
ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం ఆపాలని 'బ్యాన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్' అనే వర్కింగ్ టైటిల్‌తో సందేశాత్మక షార్ట్ ఫిలిం షూటింగ్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యాన సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఎల్లాజీ మీడియాతో మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకం అనేది ప్రమాదకర స్థాయికి చేరిందని, దీనివల్ల అంతుచిక్కని రోగాలకు ప్రజలు గురవుతున్నారని తెలిపారు. ప్లాస్టిక్‌ను బ్యాన్ చేస్తూ ఎన్నోసార్లు ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రజల్లో మార్పురానంత కాలం ఈ సమస్య కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్ని చైతన్యపరిచే విధంగా వైజాగ్ షార్ట్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ ఈ ఫిలిం రూపొందిస్తుందని తెలిపారు. ఈ షార్ట్ ఫిలిం షూటింగ్ ఒక్క రోజులో పూర్తి చేసుకునే విధంగా తీస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే కాలంలో వైజాగ్ షార్ట్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ అల్లూరి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యాన ఇటువంటి సందేశాత్మక షార్ట్ ఫిలిమ్స్ రూపొందిస్తామని తెలిపారు. దిలీప్, శ్రీను కెమెరామెన్లుగా, మాస్టర్ జిగేష్, రాజు, హుష్ కాకి అప్పారావు, అష్రఫ్ వివిధ పాత్రల్లో నటించారు.