ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న వారికి ఈ విధానం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. అదే వారి ఆస్తులను స్వాధీనం చేసుకొంటే బ్యాంకులు నష్టపోయిన మొత్తాన్ని వసూలు చేయవచ్చు. కాని ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోకుండా ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీని ఏర్పాటు చేయటం ద్వారా రుణాలు ఎగ్గొట్టిన వారికి లబ్ధి చేకూరుస్తున్నది. కొన్ని సందర్భాలలో రుణాలు ఎగ్గొట్టినవారే బినామీ పేర్లతో వేలంలో పాల్గొని, నామమాత్రపు ధరలకు అదే ఆస్తులను తిరిగి స్వంతం చేసుకొంటున్నారు.
బ్యాంకులు ఎదుర్కొంటున్న ఎన్‌పిఎ (వసూలు కాని రుణాలు)ల సమస్యను పరిష్కరించటం కోసమంటూ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు ప్రభుత్వ బ్యాంకుల ఉనికికి ప్రమాదం కలిగించి, వాటిని ప్రైవేటీకరించటానికి దారితీస్తాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఖాతాల లోని వసూలు కాని రుణాలను తీసుకొని, అంతిమంగా వాటిని పరిష్కరించటం కోసం అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ- ఎఆర్‌పి) ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఇప్పటికి 28 ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు ఉన్నా మరొకదానిని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు తీసుకుని, చెల్లించని బకాయిలను వసూలు చేయటంలో ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు ఉపయోగపడటం లేదని గత అనుభవం రుజువు చేస్తున్నది.
సరళీకరణ విధానాలు ప్రారంభమైన తర్వాత బ్యాంకులు ఇచ్చిన రుణాలలో వసూలు కాని బాకీల సమస్య ప్రధానంగా ముందుకు వచ్చింది. అంతకు ముందు బ్యాంకులు ఇచ్చిన రుణాలలో వసూలు కాని బకాయిల సమస్య నామమాత్రంగానే ఉండేది. కాని సరళీకరణ విధానాలు ప్రారంభమైన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనా రంగంలో విధానాలతో పాటు, బ్యాంకుల రుణ ప్రాధాన్యతలను కూడా ప్రభుత్వం మార్చింది. అంతకు ముందు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రభుత్వసంస్థలే నిర్మించేవి. టెలిఫోన్, విద్యుత్, రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు తదితరాలను ప్రభుత్వ రంగం లోని సంస్థలే నిర్మించేవి. కాని సరళీకరణ విధానాలతో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాలనే వాదనతో ప్రైవేటు సంస్థల ప్రవేశానికి మార్గం సుగమం చేశారు. కొన్ని ప్రాజెక్టులను ప్రైవేటు సంస్థలు స్వంతంగా తీసుకోగా, మరి కొన్నింటిలో పిపిపి (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్) విధానాలను ప్రవేశపెట్టారు. ఈ సంస్థలు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వటం కోసం ఇండియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సిఎల్)ను 2006లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ మొత్తం ప్రాజెక్టు పెట్టు బడిలో 20 శాతం దీర్ఘకాలిక రుణంగా ఇస్తుంది. 10 శాతం ప్రభుత్వ గ్రాంట్లు, ప్రాజెక్టుల నిర్వాహకుల పెట్టుబడి ఉన్నా, 70 శాతం పెట్టుబడులను ప్రభుత్వ బ్యాంకులే ఇవ్వాల్సి వచ్చింది.
సరళీకరణ విధానాలతో మరో పరిణామం కూడా సంభవించింది. దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావటానికి ఉన్న ఆటంకాలను ప్రభుత్వం తొలగించటంతో విదేశీ పెట్టుబడులు రావటం పెరిగింది. ఆ నిధులు బ్యాంకుల వద్ద పోగుపడి, అధికంగా రుణాలు ఇవ్వాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాయి. అటువంటి పరిస్థితులలో మౌలిక రంగ ప్రాజెక్టులకు రుణాలివ్వటం ప్రారంభించాయి. దానితో పాటు ప్రభుత్వాల లోని ముఖ్యుల ఒత్తిడితో లాభదాయకం కాని ప్రాజెక్టులు, పరిశ్రమలకు కూడా రుణాలు ఇచ్చాయి. మౌలిక రంగంలో నిర్మించే ప్రాజెక్టులు పూర్తి కావటం, వాటిపై లాభాలు రావటానికి ఎక్కువ కాలం పట్టటం, బ్యాంకులు తమ డిపాజిట్‌దారులకు స్వల్పకాంలో చెల్లింపులు చేయాల్సి రావటంతో బ్యాంకులకు సమస్యలు ఎదురవసాగాయి.
మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం రుణం తీసుకున్న సంస్థలు సకాలంలో రుణ వాయిదాలు చెల్లించకపోవటం పెరిగింది. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి-ఆ సంస్థలు నిర్మించిన ప్రాజెక్టులపై ఆశించిన లాభాలు రాకపోవటంతో రుణాలు చెల్లించలేని స్థితిలో పడిన సంస్థలు కొన్ని ఉన్నాయి. రెండవది- లాభాలు వస్తున్న సంస్థలు కూడా ఉద్దేశ్యపూర్వకంగానే రుణాలు చెల్లించకుండా తమ లాభాలను ఇతర రంగాలలోకి తరలించాయి. ఫలితంగా బ్యాంకులకు తిరిగిరాని బకాయిలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం రుణాలు చెల్లించని వారిపై చర్యలు తీసుకోకుండా బ్యాంకులను బలిపశువులను చేస్తున్నది.
ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ ఏం చేస్తుంది ?
ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ బ్యాంకులకు బకాయి పడిన సంస్థలు ఉన్న రుణం మొత్తాన్ని వసూలు చేయటానికి బాధ్యత తీసుకోకుండా, ఆ రుణాన్ని ఎంత మొత్తం తగ్గించి వసూలు చేయటానికి అవకాశం ఉందో ఆ మేరకే బాధ్యత తీసుకొంటుంది. బ్యాంకుల వద్ద వసూలు కాకుండా చెడ్డ రుణాల జాబితా లోకి చేరిన వాటిలో ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ అమ్మకానికి తీసుకొనే ఆస్తుల విలువను రేటింగ్ ఏజన్సీలు అంచనా వేస్తాయి. ఆస్తులను అమ్మటానికి నిర్ణయించే ధరలు ఆస్తులు కొనేవారికి ఆకర్షణీయంగా ఉండాలని ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు వాదనలు చేస్తున్నాయి. ఎన్‌పిఎ ల అమ్మకానికి నిర్ణయించిన ధరకు సబ్సిడీని కూడా కలిపి వేలం వేస్తారు. ఈ విధానం పరిమితమైన ఫలితాలను మాత్రమే ఇచ్చింది. ఎన్‌పిఎ లను అమ్మటం ద్వారా 2006-07 నుండి 2012-13 మధ్య సంవ త్సరానికి సగటున రూ. 10 వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఆస్తిని అమ్మటానికి ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీకి ఐదు సంవత్సరాలు గడువు ఇస్తారు. అప్పటికీ అమ్మకం పూర్తికాకపోతే మరో మూడు సంవత్సరాలు పొడిగిస్తారు.
ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న వారికి ఈ విధానం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. న్యాయంగా రుణాలు చెల్లిస్తున్నవారికి కూడా రుణాలు ఎగ్గొడితే లాభం వస్తుందనే భావనను కలిగిస్తుంది. తాము రుణం తీసుకున్న సంస్థ కార్యకలాపాల ద్వారా లాభాలు సంపాదించి, ఆ లాభాలను ఇతర సంస్థలకు తరలించి, బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టిన వారు దర్జాగా తిరుగుతుండగా, దివాళా తీయించిన సంస్థను స్వాధీనం చేసుకొంటే వచ్చే ఆదాయం నామమాత్రంగానే ఉంటుంది. అదే వారి ఆస్తులను స్వాధీనం చేసుకొంటే బ్యాంకులు నష్టపోయిన మొత్తాన్ని వసూలు చేయవచ్చు. కాని ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోకుండా ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీని ఏర్పాటు చేయటం ద్వారా రుణాలు ఎగ్గొట్టిన వారికి లబ్ధి చేకూరుస్తున్నది. కొన్ని సందర్భాలలో రుణాలు ఎగ్గొట్టినవారే బినామీ పేర్లతో వేలంలో పాల్గొని, నామమాత్రపు ధరలకు అదే ఆస్తులను తిరిగి స్వంతం చేసుకొంటున్నారు.
బ్యాంకులకు వస్తున్న నష్టాన్ని ఈ విధానం వలన పూడ్చుకోవటం సాధ్యం కాదు. బ్యాంకుల నుండి ఆస్తుల పునర్నిర్మాణ కంపెని తీసుకున్న ఎన్‌పిఎలు తక్కువ ధరకు అమ్ముడుపోతాయి. అవి అమ్ముడు పోయేవరకు ఆస్తి విలువలో 1.5 శాతం ప్రతి సంవత్సరం ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీకి బ్యాంకు కమిషన్‌గా చెల్లించాలి. అమ్ముడయిన తర్వాత కూడా బ్యాంకులకు తక్కువ మొత్తమే జమ అవుతుంది. అంటే బ్యాంకులు నికరంగా నష్టపోతాయి. బ్యాంకులు నష్టాలలో ఉన్నాయని, వాటికి ద్రవ్యాన్ని అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. తద్వారా వాటిని క్రమంగా ప్రైవేటీకరించటానికి మార్గం సుగమం చేస్తున్నది. వాస్తవంగా బ్యాంకులు నష్టాల లోకి పోవటానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణం. ఈ విధానాల వలన రుణాలు తీసుకున్న ప్రైవేటు సంస్థలు లాభాలలోకి, ప్రభుత్వ బ్యాంకులు నష్టాలలోకి వెళుతున్నాయి. ప్రభుత్వం దానిని కప్పి పుచ్చి, బ్యాంకులపై నేరాన్ని మోపుతున్నది. ప్రైవేటీకరణ విధానాలలో భాగంగా బ్యాంకులను కూడా ప్రైవేటీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
2018-19, 2019-20 సంవత్సరాలలో బ్యాంకులు వరుసగా రూ. 2,36,265, రూ. 2,34,170 కోట్లు, 2020-21 మొదటి త్రైమాసికంలో రూ. 1,15,038 కోట్లు, మొత్తం రూ. 5,85,473 కోట్ల రుణాలను రద్దు చేశాయి. ఈ బకాయిలకు సంబంధించి రూ. 68,125 కోట్లు మాత్రమే జమ అయ్యాయి. బ్యాంకులకు పెట్టుబడులను అందించటం కోసం 2015లో ప్రారంభించిన ఇంద్రధనుష్ ద్వారా మూడు సంవత్సరాలలో రూ. 70 వేల కోట్లు అందిస్తామని ప్రకటించారు. తర్వాత 2017లో రూ. 2.11 లక్షల కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఈక్విటీలుగా పెడతామని, దీనిలో రూ. 1.35 లక్షల కోట్లు రీకాపిటలైజేషన్ బాండ్ల ద్వారా ప్రభుత్వం నుండి వస్తాయని, మరో రూ. 18,139 కోట్లు ఇంద్రధనుష్ పథకంలో మిగిలిన మొత్తమని, మిగతా రూ. 57,861 కోట్లను బ్యాంకులు మార్కెట్ల నుండి సమకూర్చుకోవాలని చెప్పింది. ఈ విధంగా రుణాల రద్దు, బ్యాంకులకు పెట్టుబడులు అందించటం పేరుతో బాండ్లు, ఈక్విటీల ద్వారా నిధులు సమకూర్చుకోమంటూ బ్యాంకులను ప్రైవేటీకరణ బాట పట్టిస్తున్నారు.
అభివృద్ధి, సంక్షేమాలు కుంటుపడతారు
బ్యాంకులు ప్రభుత్వ రంగంలో ఉండటంతో అభివృద్ధి కుంటుబడిందని, వాటిని ప్రైవేటీకరిస్తే దేశం శరవేగంతో పురోగమిస్తుందని సరళీకరణవాదులు ప్రచారం చేస్తున్నారు. కాని బ్యాంకులు ప్రైవేటువారి చేతుల్లోకి పోతే దేశం అభివృద్ధి చెందకపోగా అభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ప్రైవేటు వారి ఆధీనంలోని బ్యాంకులు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాలను ఇస్తాయా? తమకు లాభాలు రావటానికి సంవత్సరాల తరబడి నిరీక్షిస్తాయా? ఆ ప్రాజెక్టులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే అభివృద్ధి మాటేమిటి? ఆ రంగాలలో అభివృద్ధి జరగకుండా దేశం ఎలా ముందుకు పోతుంది? బ్యాంకులు ప్రభుత్వ రంగంలో ఉండటం వలన ప్రజల పొదుపు, ఆదాయాలను ప్రభుత్వం తన అవసరాలకు, దేశ అభివృద్ధికి వినియోగించుకొంటున్నది. బ్యాంకులు ప్రైవేటువారి చేతుల్లోకి పోతే ప్రజల పొదుపును వారి స్వప్రయోజనాల కోసం వినియోగించుకొంటారు. ప్రజల డబ్బుకు భద్రత ఉండదు. రైతులు, వ్యవసాయ కార్మికులు, చిన్న వృత్తులు, వ్యాపారాలు చేసేవారికి రుణాలు లభించవు. బ్యాంకుల లోకి వచ్చిన డబ్బును తమ ఇష్టం వచ్చినట్లుగా వినియోగించుకొంటారు. డిపాజిట్‌దారుల సొమ్ముకు భద్రత ఉండదు. ప్రజల ప్రయోజనాలు, దేశ అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కారణంగానే స్వాతంత్య్రానంతరం ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేశారు. ఇపుడు ఆ అనుభవాలను పక్కన పెట్టి బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం బ్యాంకులను ప్రైవేటీకరించటానికి మోడీ ప్రభుత్వం పూనుకున్నది.
ఎ. కోటిరెడ్డి











