Mar 17,2021 06:47

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు నిర్వహించిన రెండు రోజుల సమ్మె బ్యాంకింగ్‌ రంగ చరిత్రలోనే అసాధారణమైనది. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్స్‌ యూనియన్‌ (యుబిఎఫ్‌యు) ఛత్రం కింద తొమ్మిది యూనియన్లు కలసి సంయుక్తంగా ఇచ్చిన సమ్మె పిలుపునకు బ్రహ్మాండమైన స్పందన లభించింది. బ్యాంకు ఉద్యోగులకు బాసటగా కార్మిక, కర్షక, ఇతర ప్రజా సంఘాలు వీధుల్లోకి వచ్చి 'ఖబడ్దార్‌ మోడీ సర్కార్‌' అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెలు కొత్తేమీ కాదు. గతంలో చాలా జరిగాయి. అయితే, ఆ సమ్మెలతో పోల్చితే, నేటి సమ్మె అనేక విధాలుగా ప్రాధాన్యత కలిగి ఉన్నది. గతంలో ఉద్యోగుల వేతనాలు, పని పరిస్థితుల మెరుగుదలే ప్రధానంగా డిమాండ్లు ఉండేవి. తాజా సమ్మె జాతి ప్రయోజనాలే లక్ష్యంగా రూపుదిద్దుకున్న డిమాండ్లపై సాగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వమే ద్రోహం తలపెట్టడంతో, వాటిని కాపాడుకోవడానికి నడుం బిగించారు. ప్రభుత్వ దివాళాకోరు విధానాలకు వ్యతిరేకంగా లెవల్‌-1 నుంచి సీనియర్‌ మేనేజర్ల దాకా అన్ని కేటగిరీల ఉద్యోగులు అపూర్వమైన ఐక్యతను ప్రదర్శించి ఈ సమ్మెను విజయవంతం చేశారు. ఇది బ్యాంకు ఉద్యోగుల పోరాటాల్లో వచ్చిన మార్పుకు సంకేతం. 'ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడాలి', 'ప్రజలు దాచుకున్న సొమ్ముకు భద్రత కావాలి' 'సామాజిక బ్యాంకింగ్‌ను పరిరక్షించుకోవాలి' అన్న నినాదాలు బ్యాంకు ఉద్యోగులకు పరిమితమైనవి కాదు. దేశ విశాల ప్రయోజనాలతో ముడిపడినట్టివి. 


ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటేనే విద్యా రుణం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలకు తక్కువ వడ్డీకి సులభతర రుణాలు అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్‌ రంగంలోని బ్యాంకుల దృష్టంతా ప్రజల సొమ్మును ఎలా లూటీ చేయాలన్నదానిపైనే ఉంటుంది. 1969కి ముందు ప్రైవేట్‌ సెక్టార్‌లోని బ్యాంకులు, బీమా సంస్థల చరిత్ర అంతా మోసాలు, కుంభకోణాలు, దివాలాలతో కూడినట్టిది. బినామీ కంపెనీల పేరుతో రుణాలు తీసుకుని ఎగగొట్టేవి, వడ్డీకి చక్రవడ్డీ విధిస్తూ సామాన్యులను జలగల్లా పీడించేవి. ప్రజలు దాచుకునే పొదుపు మొత్తాలను బ్యాంకుల యజమానులు స్వాహా చేసి బోర్డు తిప్పేసేవారు. దీనిపై దేశవ్యాపితంగా అలజడి రేగడంతో ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 14 ప్రధాన బ్యాంకులను జాతీయీకరణ చేసింది. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తరువాత కార్పొరేట్‌ సంస్థలు, వ్యక్తులు కొత్తగా స్థాపించిన పది న్యూజెనరేషన్‌ బ్యాంకులు అవినీతి, అసమర్థత, అక్రమాలకు ఎలా మారుపేరుగా మారినదీ చూశాం. గ్లోబల్‌ ట్రస్ట్‌బ్యాంకు, యెస్‌ బ్యాంకు, యుటిఐ, ఐసిఐసిఐ, లక్ష్మీ విలాస్‌ బ్యాంకుల స్కాముల పరంపర అందరికీ ఎరుకే. 


ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.100 లక్షల కోట్లకు పైగా ప్రజల సొమ్ము ఉన్నది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏటా రూ.150 లక్షల కోట్ల వరకు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. దేశంలో ఆర్థిక సుస్థిరత సాధించడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకులను కార్పొరేట్లకు అప్పగించడం దేశ ప్రయోజనాలకే హానికరం. దేశ వనరులపై ఇప్పటికే ఆధిపత్యం సాధించిన కార్పొరేట్లు మోడీ ప్రభుత్వ పుణ్యమాని ఇప్పుడు బ్యాంకులపై కూడా ఆధిపత్యం చలాయించే దుస్థితి దాపురిస్తోంది. ఎవరైతే ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని ఎగగొట్టారో వారికే ఈ బ్యాంకులను అప్పగించడమంటే దొంగ చేతికి తాళాలివ్వడమే!
దీనికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న పోరాటం అత్యంత సముచితమైనది. ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో ప్రజల సొమ్మును పందికొక్కుల పాల్జేయాలని చూస్తున్న బిజెపి ప్రభుత్వ ముసుగును సమ్మె తొలగించిందనడంలో సందేహం లేదు. సాధారణ ప్రజల నుండి సమ్మెకు లభించిన సానుకూల స్పందన, రైతాంగ ఉద్యమం ప్రకటించిన సంఘీభావం ఇందుకు తార్కాణం.