May 20,2023 19:55

బ్యాంకు ముందు బైఠాయించిన భాగ్యలక్ష్మి పొదుపు గ్రూపు మహిళలు

ప్రజాశక్తి - కోసిగి రూరల్‌
కోసిగిలో ఎస్‌బిఐ బ్యాంకు ముందు పొదుపు మహిళలు శనివారం బైఠాయించారు. పొదుపు అప్పునకు జమ చేయమని ఎస్‌బిఐ బ్యాంకు బీసీ పాయింటు నిర్వాహకుడికి డబ్బులు ఇస్తే, రూ.7,500 మాత్రమే తమ ఖాతాకు వేసి, మిగతా రూ.20 వేలు వేయకుండా మోసం చేశాడని భాగ్యలక్ష్మి పొదుపు మహిళలు బ్యాంకు అధికారుల ముందు వాపోయారు. బీసీ పాయింట్‌ నిర్వాహకుడు నీలి నరసింహులు చేసిన నిర్వాకానికి తమ పొదుపు గ్రూపు మహిళల్లో తాను దొంగనయ్యానని, పది మందికి సమాధానం చెప్పలేక పోతున్నామని ఓ పొదుపు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. రూ.27,500 బీసీ పాయింట్‌ నిర్వాహకుడికి కట్టిన రిసీప్ట్‌ ఉందన్నారు. ఆ రిసీప్ట్‌ ఎక్కడైనా పోయి ఉంటే తమను ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని, లేదా తమ పొదుపు అప్పు ఖాతాకు జమ చేయాలని బ్యాంకు అధికారులను కోరారు. ఎస్‌బిఐ బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ జోక్యం చేసుకుని సోమవారం బీసీ పాయింట్‌ నిర్వాహకుని పిలిపించి, మీ డబ్బులను తిరిగి ఇప్పిస్తామని పొదుపు మహిళలకు సర్ది చెప్పారు.