ప్రజాశక్తి-వేటపాలెం : కో ఆపరేటివ్ బ్యాంకులో నిధుల గోల్‌మాల్ వ్యవహారం వెలుగు చూసి ఏడాదిన్నర అయినా ఇంతవరకూ ఎలాంటి చర్యలూ లేవని బాధితులు వాపోతున్నారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ చెన్నకేశవస్వామి దేవస్థానం నుంచి పట్టణ పురవీధుల్లో ఆదివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బాధితులకు సత్వరమే న్యాయం చేయాలన్నారు. ఎ1 ముద్దాయి శ్రీరాం శ్రీనివాసరావు బెయిల్‌ను రద్దుచేయాలన్నారు. పాలకవర్గం ఆస్తులకు బహిరంగ వేలం నిర్వహించాలని నినాదాలు ఇచ్చారు. ప్రజల సొమ్ముకాజేసి డైరెక్టర్లు పశ్చాతాపం లేకుండా రోడ్లపై తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అనంతరం చెన్నకేశవస్వామి దేవస్థానంలో బాధిలతు సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి వంద మంది బాధితులు హాజరైయ్యారు.ఇప్పటికే 15మంది బాధితులు మనోవేదనతో,మందుల కొనుగోలుకు డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయారని సంఘం సెక్రటరీ జాగా బత్తుని రమేష్‌కుమార్ తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమ డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు.రూ. 25 కోట్లు రూపాయల గోల్‌మాల్ వ్యవహారం వెలుగు చూసి ఏడాదిన్నర గడిచినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టిపట్టనట్లు వ్యవహారించడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు, పజాప్రతినిధులు జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం చేయాని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో పి. సుధాకర్‌రెడ్డి, కె.శివరామకృష్ణ, జాగాబత్తుని రమేష్, వీరాంజనేయులు, రమణారెడ్డి, కృష్ణబాబు శిఖాకొల్లి ప్రకాష్ పాల్గొన్నారు.










