Oct 05,2023 23:26

జిబిసి రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు... మరిమ్మ (ఫైల్‌, ఇన్‌సెట్‌)

ప్రజాశక్తి - పొన్నూరు రూరల్‌ : ప్రైవేటు బ్యాంకులో అప్పు తీసుకున్న మహిళ మోసపోవడంతోపాటు, వాటిని చెల్లించాలనే ఒత్తిడిని తాళలేక గుండెపోటుకు గురై మరణించారు. ఇది తెలిసిన బంధువులు ఆమె మృతదేహాన్ని రహదారిపై ఉంచి ఆందోళనకు పూనుకున్నారు. మండలంలోని చింతలపూడిలో గురువారం జరిగిన ఘటనపై స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పర్రె మరియమ్మ (40) గృహ నిర్మాణం కోసం ఏడాది కిందట ఓ ప్రైవేటు బ్యాంకులో రుణం కోసం సంప్రదించారు. రూ.18 లక్షల రుణం ఆమె ఖాతాలో జమైంది. అయితే బ్యాంకు మేనేజర్‌, మధ్యవర్తి కలిసి నిరక్షరాస్యురాలైన మరియమ్మకు అబద్దాలు చెప్పారు. మంజూరైన రుణం రూ.3 లక్షలు కాగా పొరపాటున రూ.18 లక్షలు జమయ్యాయని నమ్మించి మిగతా రూ.15 లక్షలను తిరిగి తీసుకున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత మరియమ్మకు బ్యాంకు నుండి నోటీసు అందింది. తీసుకున్న రూ.18 లక్షల రుణతోపాటు వడ్డీ కలిపి రూ.22 లక్షలు చెల్లించాలని అందులో ఉంది. ఇది చూసి ఖంగుతిన్న మరిమమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసినా, స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. మరోవైపు మోసం చేసిన బ్యాంకు మేనేజర్‌ ట్రాన్స్‌ఫర్‌ అవడం, అప్పు చెల్లించాలనే ఒత్తిడితో గురువారం సాయంత్రం 4 గంటల తర్వాత గుండెపోటుకు గురై మృతి చెందారు. ఇది తెలిసిన మృతురాలి కుటుంబీకులు, బంధువుల ఆమె మృతదేహాన్ని జిబిసి రహదారిపై ఉంచి ఆందోళనకు దిగారు. బ్యాంకు మేనేజర్‌, మధ్యవర్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 6 గంటల నుండి గంటపాటు రోడ్డుపై బైటాయించడంతో భారీగా వాహనాలు నిలిచాయి. ఇది తెలిసిన పోలీసులు గ్రామానికి చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టారు. మృతదేహం ఉన్న మార్చురి బాక్సును రోడ్డు పక్కన పెట్టి వాహనాలను పునరుద్ధరించారు.