అనంతపురం కలెక్టరేట్ : జన్ సురక్ష క్యాంపెయిన్, ఘర్ ఘర్ కెసిసి అభయాన్, జగనన్న తోడు కింద 8వ విడత రుణాల మంజూరు, పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలకు సంబంధించి బ్యాంకర్లకు కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు. మంగళవారం నాడు అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జన్ సురక్ష క్యాంపెయిన్‌ను అక్టోబర్ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు మూడు నెలల పాటు నిర్వహించాలన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజెజెబివై) కింద రెండవ విడతలో జిల్లాకు 24,146 మందికి బీమా చేయించాలని లక్ష్యం విధించగా, అక్టోబర్ 27వ తేదీ వరకు 2,249 మందికి చేసినట్లు చెప్పారు. ఆయా బ్యాంకులు వాటికి కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా క్యాంపెయిన్ చేపట్టి సకాలంలో లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జగనన్న తోడు, పీఎంస్వానిధి పథకం కింద 8వ దశలో డీఆర్డీఏ పరిధిలో 12,309 మంది లబ్ధిదారులకు, మెప్మా పరిధిలో అర్హులైన 6,289 మంది వీధి విక్రేతలకు రుణాలను మంజూరు చేసి నెల రోజుల్లోగా లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ (పీకేసిసి) రుణాలకు సంబంధించి కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా, ఇప్పటివరకు 14,504 దరఖాస్తులను బ్యాంకులకు పంపించగా, అర్హులైన రైతులకు రుణాలను సకాలంలో మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎల్డీఎం సత్యరాజ్, నాబార్డ్ ఏడీఎం అనురాధ, ఎడిసిసి బ్యాంకు సిఈవో సురేఖారాణి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, మెప్మా పీడీ విజయలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రహ్మణ్యం, డీఎల్డీఏ ఓబులమ్మ, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, ఏఎల్డీవో మానసశ్వేత పాల్గొన్నారు.










