
రాయచోటి : నేతలు, ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మాత్రం మారలేదని అన్నమయ్య జిల్లా మేదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుట్టలల్లినా బువ్వకు నోచుకోవడం లేదని వాపోతున్నారు. గతంలో నిచ్చెనులు, వెదురు, కొయ్యలు, గంపలు, విసనకర్ర, తడికలకు గిరాకీ ఎక్కువగా ఉండేది. రాను రానూ ప్లాస్టిక్ వస్తువులు రావడంతో వీటిని కొనుగోలు చేసేవారు సంఖ్య గణనీయంగా తగ్గు ముఖం పట్టింది. గతంలో ఎండాకాలం వచ్చిందంటే విసనకర్రలకు అధిక డిమాండ్ ఉండేది. నేడు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రావడంతో విసనకర్రలు కొనే వారి సంఖ్య కనుమరుగైంది. పండగలొచ్చాయంటే అందరూ గంపలు, చాటలు కొనేవారు. గంపల్లో అన్నం వార్చేవారు, నేడు అంతా ఎలక్ట్రికల్ కుక్కర్లో వంట వండడం వల్ల ఈ గంపలకు గిరాకి లేకుండా పోయింది. ఎండాకాలం వచ్చిం దంటే ఇంటి ఆరు బయట ఎండబెడదను తట్టుకునేలా వెదురు దబ్బలతో అలిన తడికలను ఉపయోగించి ఉపసమనం పొందేవారు. పేదలు తమ ఇళ్లకు తడికలు కొని మరుగుదొడ్లకు అమర్చుకునేవారు. ప్రస్తుతం వాటినీ కొనేవారు లేక వ్యాపారాలు సన్నగిల్లుతున్నాయి. ఇక నిచ్చెనల విషయానికొస్తే ఏ పని చేయాలన్నా, పైనున్న వాటిని అందుకోవాలన్నా నిచ్చెను ఉపయోగించేవారు. నేడు ఎలక్ట్రానిక్ నిచ్చెనులు అల్యూమినియం ఎత్తైన స్టూల్స్ రావడంతో కొనేవారు కూడా కరువయ్యారు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు పందిళ్లు వేయాలన్నా కూడా కొయ్యలు ఎంత అవసరం. అలాంటి కొయ్యలు లేకుండానే నేడు రెడీమేడ్ షామి యానాలు వచ్చేశాయి. రాయచోటి ప్రాంతంలో మేదర్లు గంపలు, చాటలు, పందిరి కొయ్యలు, పోట్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ బుట్టలు కొనుగోలు చేసేవారు వస్తే కానీ జీవనం గడవదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు పొదలకూరు, ప్రకాశం, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి రైతులు సరుడు తోటలో ఉన్నటువంటి కొయ్యలను కొనుగోలు చేసి అక్కడ నుండి ఇక్కడికి తీసుకువచ్చి వాటి విక్రయించి జీవనం సాగిస్తున్నామన్నారు. తమ వద్ద 10, 11, 12, 15, 20 అడుగుల పోటుకొయ్యలు నిచ్చెన్లు అందుబాటులో ఉన్నాయ న్నారు. కోళ్ల గంపలు, చిన్న గంపలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. చేటలు కూడా నాణ్యమైనవిగా తయారుచేసి అందుబాటులో ఉంచామన్నారు. ఏది ఏమైనప్పటికీ బుట్టలల్లే సమయంలో ఎదురు తిరిగి పలుమార్లు చేతులు కాళ్లు గాయాలు అవుతుంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి బ్యాంకుల ద్వారా తమకు ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదని వాపోతున్నారు. కానీ ప్రభుత్వం చేతి వత్తుల వారికి ఆర్థిక సాయం అందిస్తున్నమంటూ ప్రకటనలు చేస్తున్నారని తప్ప, తమకు అందుబాటులోకి రావడం లేదని వాపుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం చేయాలని మేదర్లు కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
మేదర వత్తి చేసే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండడం వల్ల వెదరు వస్తువులకు గిరాకీ తగ్గింది. మేదర పనిచేసే కూలీలందరికీ లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు అందజేయాలి. వెదురు కోయిల పెట్టుకుంటే స్థలం కూడా రాయచోటి జిల్లా కేంద్రం కావడంతో బాడుగలు ఎక్కువ అయ్యాయి. వ్యాపారాలు కూడా సరిగ్గా జరగడం లేదు. దీంతో జీవనం సాగించాలంటే ఇబ్బందిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేధారల పనిచేసే కూలీలందరిని ఆదుకోవాలి.