ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని పట్టం పంచాయతీ బూరువలస గ్రామంలో తాగునీటి కోసం మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సౌకర్యం లేక పోవడంతో కిలోమీటర్ దూరంలో కాలిబాటను నడిచి వెళ్లి గెడ్డ నీటిని తెచ్చుకుంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తాగునీటి సమస్యను తీర్చ లేదంటూ గ్రామ ప్రజలు వాపోతున్నారు. బూరు వలస గ్రామంలో గ్రావిటీ స్కీమ్ 2007-2009 సంవత్సర కాలంలో ఏర్పాటు చేశారు. 2012 నుంచి ఊట నీరు సరఫరా కాక వీధి కుళాయిల నుంచి ఆగి పోవడంతో తాగునీటి కోసం మహిళలు అధికారుల చుట్టూ తిరిగారు. సిపిఎం నేతలతో కలిసి ఎన్నో పోరాటాలు చేయడంతో 2020 నాటికి సోలార్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. సోలార్ నుంచి వీధుల్లో కొలాయిలకు పైప్ లైన్ కనెక్షన్ సరిగా ఇవ్వలేదు. తాగునీటి సమస్య తీర్చాలని చెప్పినా పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో దాహాన్ని తీర్చుకునేందుకు తాగునీటి కోసం గ్రామ ప్రజలు పరుగులు తీస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు తమ సమస్యను గుర్తించి తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.










