Feb 18,2023 21:54

ప్రజాశక్తి - టి.నరసాపురం
               సీనియర్‌ బుర్రకథ కళాకారులు మామిళ్లపల్లి సుబ్బారావు అకాల మృతికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజానాట్యమండలి గౌరవ అధ్యక్షులు బుర్రకథ కళాకారులు సబ్బి కనకారావు, ఏలూరు జిల్లా నాయకులు టివిఎస్‌.రాజు సంతాపం తెలిపారు. మండలంలోని బొర్రంపాలెంలో జన్మించిన సుబ్బారావు చిన్నతనం నుంచి కళల పట్ల ఆసక్తితో బుర్రకథ కళాకారునిగా భక్తిరస భజన కళాకారునిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి అనేకమంది యువకులను కళాకారులుగా తీర్చిదిద్దారని అదే గ్రామానికి చెందిన వీరమల్ల సత్యనారాయణ, బచ్చు నందకుమార్‌, తిప్పర్తి వీర బ్రహ్మచారి కొనియాడారు. తాము ఆయనకు ప్రియ శిష్యులమని తెలిపారు. సుదీర్ఘకాలం కళాజీవితం కొనసాగిస్తున్న ఆయన బొర్రంపాలెం నుంచి గుంటూరు జిల్లా గురజావోలులో నివాసం ఏర్పాటు చేసుకుని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో సంగీత కచేరీలు, భజనలు చేస్తూ సుమారు రెండు దశాబ్దాలకు పైగా కుటుంబ సమేతంగా అక్కడే నివాసం ఉన్నారని తెలిపారు. ఇటీవల ఆయన జన్మస్థలమైన బొ ర్రంపాలెం వచ్చి తన శిష్య బృందంతో ఆనందంగా గడి పారన్నారు. ఈ నెల 22వ తేదీన బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్‌ వర్థంతి జరుపుకునే అంశంపై చర్చించామని 17వ తేదీ ఉదయం పది గంటలకు ఇదే అంశంపై ఫోన్‌లో మాట్లాడి పద్మశ్రీ నాజర్‌ వర్థంతి కార్యక్రమానికి తాను హాజరవుతానని తనతో అన్నారని టివిఎస్‌.రాజు అన్నారు. శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన సుబ్బారావు మతికి జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఆర్‌.కృష్ణబాబు, వర్ధమాన సినీ నటుడు తిరుపతి రమేష్‌ బాబు, సీనియర్‌ కోలాట కళాకారుని బొందలపాటి పద్మావతి, సాయన రాఘవమ్మ, ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ సాయిన కనకరాజు, సామాజిక సేవా కార్యకర్త వీరమల్ల మధు, ప్రజానాట్యమండలి ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు కంకిపాటి ఏసు పాదం, కంకిపాటి బుచ్చిబాబు, ముల్లగిరి అలెగ్జాండర్‌, పౌరాణిక రంగస్థల కళాకారులు తోట సత్యనారాయణ, తోట లక్ష్మీనారాయణ సంతాపం తెలుపుతూ వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.