
'అన్నయ్యా! ఒక్కసారి ఇవ్వరా ప్లీజ్ ! కాసేపు ఆడుకొని ఇచ్చేస్తానూ'.. రోజూ మాదిరే బతిమిలాడుకుంది భారతి.
'పోవే.. పోయి నీ గురుగులతో ఆడుకో.. ఇవ్వటం కుదరదు' అని రాజేష్ విమానం బొమ్మను గాలిలో ఆడిస్తూ తన చెల్లిని కసిరాడు.
'ఏం? ఎందుకియ్యవేం? బదులుగా నా వంట పిడతలన్నీ నీకిచ్చేయనా పోనీ' ఆశగా అడిగింది భారతి.
'ఛీ..వంట పిడతలతో నేను ఆడాలా? బుద్ధి లేదూ?! ''అవి'' నీకూ, ''ఇవి'' నాకూ అని కొనిచ్చారుగా నాన్న! ఆడపిల్లలు ఇవి అడగనేకూడదు' ఢాం..ఢాం.. అంటూ బొమ్మ తుపాకీతో శబ్దం చేస్తూ ఇల్లంతా పరుగులు తీశాడు రాజేష్.
భారతి చిన్నబుచ్చుకుని 'చూడు నాన్నమ్మా! కాసేపిస్తేనే అరిగిపోతాడా ఏం?' అంది.
'అయినా నీకు మగపిల్లాడితో పోటీ ఏంటే? వంటలాటలూ, తొక్కుడుబిళ్ళాట ఆడుకోవాలిగానీ.. మగరాయుడల్లే విమానాలూ, తుపాకులూ పట్టుకు తిరుగుతావా ఏంటీ?!' అందావిడ మందలింపుగా.
ఇంతలో పంచదార తెమ్మని ఐదు వందల నోటు రాజేష్‌కి ఇచ్చి పంపింది తల్లి. భారతి 'నేనూ వస్తా' అంటూ అన్న వెంటపడింది.
కిరాణా కొట్టులో ఇచ్చిన మిగిలిన డబ్బునూ, పంచదారనూ ఒకే సంచిలో వేసుకుని, కబుర్లాడుకుంటూ ఇంటిదారి పట్టారు అన్నాచెల్లెలు.
ఇంతలో వీరిపక్క నుండి సైకిల్‌పై వెళుతూ, ఓ వ్యక్తి రాజేష్ చేతిలోని సంచిని లాక్కుని పోసాగాడు. అంత డబ్బు ఒక్కసారిగా పోగొట్టినందుకు అమ్మ ఎంత కోప్పడుతుందోననే భయంతో రాజేష్ నుంచున్న చోటే బిగుసుకుపోయాడు.
భారతి మాత్రం 'పట్టుకోండీ..! పట్టుకోండీ..!' అంటూ చాలా దూరం బాణంలా దూసుకుపోయి, అతని వెంటపడింది.
దాంతో అటుగా వస్తున్నవారు ఆ సైకిల్‌ని అడ్డగించి, ఆ సంచిని భారతికి అప్పగించి, దొంగని మందలించి వదిలేశారు. ఇంటికి చేరగానే చెల్లాచెదురైన వంట గురుగులను సర్దుకుంటున్న చెల్లి చేతిలో తన తుపాకీ, విమానం బొమ్మలుంచి, మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు రాజేష్. తుపాకీతో ఆడితే నాన్నమ్మ తిడుతుందేమోనని భయపడింది భారతి.
కానీ విచిత్రంగా ఎవ్వరూ తన ఆటలకు అడ్డు చెప్పకపోగా, 'ఇంత ధైర్యం ఎక్కడిది తల్లీ నీకూ? పోలీసవుతావా?' అంటూ నాన్నమ్మే మురుసుకోవటం భారతికి ఎంతో ఆనందం కలిగించింది.
అంతేకాదు తనపై తనకు ఎంతో నమ్మకమూ కలిగింది.
'నేను పైలట్ అవుతా!' అని గట్టిగా చెబుతూ విమానంతో పాటూ జురు.రు..రు...అంటూ పరుగులు పెట్టింది భారతి.
- మనోజ