
వాకింగ్ ముగించుకుని వచ్చేసరికి ఇంట్లో వాతావరణం చాలా గంభీరంగా కనిపించింది యాదగిరికి. ఏం జరిగి ఉంటుందబ్బా అని ఆలోచిస్తుండగా, లక్ష్మి ఎదురుగా వచ్చింది!
''నిన్నటి నుండి నానిగాడు అడిగిందేదో ఇప్పించొచ్చు కదా!'' అన్నది కోపంగా లక్ష్మి. నిన్న ఆఫీసు పని ఒత్తిడిలో పడి వాడేదో అడుగుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు! దాని ఫలితమే ఇది!
''సర్లే! ఏం కావాలో చెప్పరా నాని!'' అన్నాడు యాదగిరి.
''మరే నాకు ఒక బుల్డోజర్ కావాలి!'' అన్నాడు నానిగాడు తల్లి చాటు నుండి బయటకు వచ్చి.
తల్లిదండ్రులు ఇద్దరూ అదిరిపడ్డారు!
''బుల్డోజర్ ఎందుకురా!'' అడిగాడు యాదగిరి.
''గల్లీలో మా ఫ్రెండ్స్‌లో ఒకడు నన్ను ఏడిపిస్తున్నాడు! వాడ్ని బెదిరించటానికి నాకు బుల్డోజర్ కావాలి!'' అన్నాడు నానిగాడు.
తల్లిదండ్రులు మరోసారి అదిరిపడ్డారు. నానిగాడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాని వాడు వినలేదు. దాంతో యాదగిరి వాడిని బొమ్మల షాపుకి తీసుకెళ్ళి ఒక బుల్డోజర్ బొమ్మ కొనిపించాడు. నానిగాడు గలి ్లలోకి దౌడుతీశాడు.
యాదగిరి అట్నుంచి అటే ఆఫీసుకి వెళ్ళాడు. కాని కొడుకు గొడవలో పడి ఆఫీసుకి వెళ్ళేసరికి బాగా ఆలస్యము అయ్యిందని గుర్తించలేదు. కాని బాస్ గుర్తించాడు. తన ఛాంబర్‌కి పిలిపించాడు. బాస్‌ను చూసేసరికి యాదగిరికి చెమటలు పట్టాయి.
''న..న..న..న.. నమస్కారం సార్!'' అన్నాడు ఏదో యాడ్‌లో చిరంజీవిలా.. బాస్ మాట్లాడలేదు! గుడ్లురిమిచూశాడు. ఆ తర్వాత బెల్‌కొట్టాడు. అటెండర్ వచ్చాడు. బాస్ సైగను అర్థం చేసుకున్నాడు. ప్రింటర్‌లో నుండి ఒక పేపర్ ప్రింట్ తీసి యాదగిరి చేతిలో పెట్టాడు! ఆ పేపర్‌లో ఒక బుల్డోజర్ బొమ్మ ఉంది!
''ఇ... ఇదేమిటిసార్!'' అన్నాడు యాదగిరి గొంతు పెగల్చుకుని.
''ఆలస్యమైనందుకు ఇది వార్నింగ్!'' ఇలాంటివి మూడు వచ్చాయంటే ఇక్కడ్నుంచి నిన్ను లేపేస్తా!'' అన్నాడు బాస్!
తలొంచుకుని వచ్చి తన సీట్లో కూచున్నాడు. ఏదో విధంగా పని పూర్తిచేసుకుని ఇంటికి వచ్చాడు.నానిగాడు ఏడుస్తూ ఎదురొచ్చాడు!
''మళ్ళీ ఏమైందిరా! పొద్దున్న బొమ్మ కొనిచ్చాను కదా! దాంతో నీ ఫ్రెండ్‌ను భయపెట్టలేదా!'' అన్నాడు యాదగిరి. ''నీవు కొనిచ్చిన బొమ్మతో వాడిని బయపెడదామని ట్రై చేశాను. కాని వాడు వాళ్ళ డాడీకి ఫోన్‌చేసి నిజం బుల్డోజర్‌నే తెప్పించాడు!'' అన్నాడు నానిగాడు ఏడుస్తూనే!
''వాళ్ల నాన్నేమో కాంట్రాక్టరంట! మీరేమో ఒట్టి గుమాస్తా గిరి వెలగపెడుతుంటిరి!'' అంటూ లక్ష్మి నానిగాడిని లోపలికి తీసుకెళ్ళింది. యాదగిరికి కళ్ళు తిరిగినట్లై సోఫాలో కూలబడ్డాడు.
''ఏమిటిది? బుల్డోజర్లకు ఇంత శక్తి ఎక్కడిది! బుల్డోజర్ అంటే ఆధిపత్యమా! బుల్డోజర్ అంటే అణిచివేతా! బుల్డోజర్ అంటే కూకటివేళ్ళతో పెకిలించటమా! ఇంతకీ బుల్డోజర్ దేనికి ప్రతీక!'' అని ఆలోచిస్తున్నాడు.
''ఏమిటి యాదగిరీ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?'' అంటూ వచ్చాడు మిత్రుడు తిరుపతి!
''రారా! తిరుపతి! బుల్డోజర్ గురించి ఆలోచిస్తున్నాను'' అన్నాడు యాదగిరి. ఇంతలో చాయి తీసుకుని వచ్చింది లక్ష్మి!
''ఏంటమ్మా మీ ఆయన బుల్డోజర్ కొంటున్నాడా! నాకు మాటకూడా చెప్పలేదు!'' అన్నాడు తిరుపతి ఆశ్చర్యంగా!
''అంత సీన్ లేదురా! పొద్దుటి నుండి బుల్డోజర్ చుట్టూ కథ తిరుగుతోంది!'' అని అంతా వివరించాడు యాదగిరి.
వాళ్ళు మాట్లాడుకుంటూండగానే టీవీలో వార్తలు వచ్చాయి. న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్నది. ''కేంద్ర మంత్రి కాన్వాయిలో బుల్డోజర్స్. గతంలో మంత్రుల కాన్వాయిలో ఇన్నోవా కార్లు దర్శనమిచ్చేవి. కాని ఇప్పుడు వాటికి బదులుగా బుల్డోజర్లను వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది! తమకు ఎన్నికల గుర్తుగా బుల్డోజర్‌ని కేటాయించాలని ఎన్నికల సంఘానికి పలు పార్టీల వినతి! కాని వాటిని తిరస్కరిస్తూ పువ్వుగుర్తు పార్టీకే బుల్డోజర్‌ను కేటాయించుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నది! ఆ పార్టీకి తప్ప మరేపార్టీకి బుల్డోజర్ గుర్తు సూట్‌కాదని ఎన్నికల సంఘం ప్రతినిధి ప్రకటించారు!''
మిత్రులు ఇద్దరూ ఒకరిమొహం మరొకరు చూసుకున్నారు. ఈలోగా టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది!
''భారత్ పర్యటనలో భాగంగా బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్‌లో బుల్డోజర్ ఎక్కి ఫొటోలు దిగారు! దీనిని బట్టి భారత్‌లో బుల్డోజర్‌కి ఎంత ప్రాధాన్యత ఉందో స్పష్టమవుతున్నది.''
ఇది టీవీలో చూడగానే మిత్రుల హదయాలు మండిపోయాయి. యాదగిరికి ఇంతకు ముందు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి! అదే మాట తిరుపతితో అన్నాడు.
''నీవు రాక ముందు బుల్డోజర్ దేనికి ప్రతీక అని మదనపడ్డాను. దానికి సమాధానం ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పాడు!''
బుల్డోజర్ ఆధిపత్యానికి, అణిచివేతకు, దోపిడీకి ప్రతీకిగా మారింది!
''దేశంలో ఉత్తరప్రదేశ్‌లో, ఢిల్లీలో బుల్డోజర్ అణిచివేతకు పాల్పడింది! పువ్వు గుర్తు పార్టీ పాలకులు ప్రజలను ప్రశ్నించిన వారిని అణిచివేయటానికి బుల్డోజర్లను వాడుకుంటున్నారు!'' అన్నాడు యాదగిరి.
''అవును నిజమే! ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో 70 ఏళ్ళ స్వతంత్రం తర్వాత మన సొంత పాలకులే, మనను బుల్డోజర్ల ద్వారా అణిచివేస్తున్నారు! అందుకే 200 సంవత్సరాల పాటు తాము చేసిన పనినే ఈనాడు భారత పాలకులు చేస్తున్నారు! తమకు, భారత పాలకులకు తేడా ఏమీ లేదని చెప్పేందుకే ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ బుల్డోజర్ ఎక్కి ఫోజులిచ్చాడు'' అన్నాడు తిరుపతి!
''తెల్లవారి అణిచివేత నుండి 200 ఏళ్ళ తర్వాత విముక్తి పొందామని, ఆనందించే పరిస్థితి లేదు! 70 ఏళ్ళ స్వతంత్రం తర్వాత ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అణిచివేత! మన బతుకులకు విముక్తి లేదా?'' ఆవేదనగా అన్నాడు యాదగిరి ఆవేదనగా.
మిత్రుల మాటలు వింటున్న లక్ష్మి జోక్యం చేసుకుంది.
''విముక్తి ఎందుకు లేదు! విముక్తి మార్గాన్ని చూడటం లేదు అంతే! 200 ఏళ్ళ తెల్లవారి అణిచివేత, ఎన్నో పోరాటాల తర్వాతే అంతమైంది! గాంధీ, నెహ్రూ, భగత్‌సింగ్, ఆజాద్, అంబేద్కర్ లాంటి మహనీయుల పోరాటాలే బ్రిటిష్ వారి నుండి మనకు విముక్తి కలిగించాయి. 70 ఏళ్ళ తర్వాత మళ్ళీ అణిచివేత మొదలైంది! ఆ ఆణిచివేతకు బుల్డోజర్లు ప్రతీకగా కన్పిస్తున్నాయి! మరి ఢిల్లీలో బుల్డోజర్ల అణిచితేతను ప్రతిఘటించిన సీపీఐ(ఎం) నేత బృందాకరత్‌ను చూడండి! పీడిత ప్రజల పక్షాన అధికారాన్నీ, అణిచివేతనూ, నిరంకుశత్వాన్నీ ఎదిరించి నిలిచారు. బుల్డోజర్లను ఎదిరిస్తున్న బృందాకరత్‌లే కావాలిప్పుడు దేశానికి!'' అన్నది లక్ష్మి.
- ఉషాకిరణ్,
సెల్: 9490403545