కోవిడ్ వల్ల ఇంతవరకు 4,13,000 మంది చనిపోయారని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే 2020 జనవరి నుంచి 2021 జూన్ మధ్య కోవిడ్ వల్ల ఇండియాలో మరణించినవారి సంఖ్య 34 లక్షల నుంచి 47 లక్షల దాకా ఉంటుందని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ జరిపిన తాజా అధ్యయనం వెల్లడించడంతో భారత ప్రభుత్వ గణాంకాల విశ్వసనీయత సంక్షోభంలో పడింది. అధ్యయన నివేదిక వివరాలనుబట్టి కోవిడ్ మృతుల సంఖ్యను ప్రభుత్వం చాలావరకు తగ్గించి చూపిందని స్పష్టమవుతోంది. ఇతర దేశాల్లో కూడా మరణాల సంఖ్య తగ్గించి చూపడం వంటివి ఉన్నా మరీ ఇంత దారుణంగా కాదని నివేదిక వ్యాఖ్యానించింది కూడా. అధికారిక గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 40.13 లక్షలని పేర్కొంటున్నారని, వాస్తవానికి కోటి పై మాటేనని ఆ నివేదిక తెలిపింది. అంటే ఆయా ప్రభుత్వాలు ప్రకటించిన సంఖ్యకు, అధ్యయన నివేదిక అంచనా 250-300 శాతం కాగా భారత్ విషయంలో అది వెయ్యి శాతం కన్నా ఎక్కువన్నమాట. ఎంత దారుణం! వాస్తవాలను ఇంతలా తొక్కిపెట్టిన ప్రభుత్వం 'కోవిడ్‌ను జయించేశాం' అంటూ గొప్పలకు పోయింది. దేశీయ అవసరాలను విస్మరించి టీకాలను విదేశాలకు ఎగుమతి చేసింది.
ఆక్సిజన్ అందని కారణంగా ఎవరూ మరణించినట్టు నిర్దిష్ట నివేదికలేవీ లేవని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారంటే కోవిడ్ మృతుల వాస్తవ సంఖ్యను వెల్లడించరాదని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని తేటతెల్లమవుతోంది. ఆక్సిజన్ కొరత వల్ల దేశమంతటా అనేక ఆసుపత్రుల్లో వందలాది మంది మరణించిన వాస్తవం మంత్రికి తెలియదా? భారత్‌లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడిందన్న విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశం కావడం, కొన్ని దేశాలు ప్రాణవాయు సిలిండర్లను విమానాల్లో పంపడం ఎందుకు జరిగింది? దేశంలోని అన్ని ప్లాంట్లలోనూ ఇండిస్టియల్ ఆక్సిజన్ ఉత్పత్తి నిలిపివేసి, ఆమేరకు మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ఎందుకు నిర్ణయించింది? ఆక్సిజన్ లేక కొన ప్రాణాలతో కొట్టుకులాడి తుది శ్వాస విడిచిన వారి కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు మంత్రి సమాధానం పుండు మీద కారం చల్లినట్టుండదా? డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం మాటంటే గౌరవం వుంటుందా? అసలు ఈ దేశ ప్రజలకు ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థ పట్ల ఎంతలా అపనమ్మకం పెరిగిపోతుందో కదా! అన్నిటికీ మించి ఈ దేశ అత్యున్నత చట్ట సభను, దేశ ప్రజలందరినీ తప్పుదారి పట్టించడం క్షంతవ్యం కాని నేరం.
కోవిడ్ కారణంగా గత 14 నెలల్లో 21 దేశాల్లో 15 లక్షల మంది పిల్లలు తమ తల్లిని లేదా తండ్రిని కోల్పోయారని, భారత్‌లో ఇటువంటి బాలలు 1,19,000 మంది ఉన్నారని లాన్సెట్ జరిపిన తాజా అధ్యయనం పేర్కొంది. భారత్‌లో 25,500 మంది చిన్నారులు కోవిడ్ కారణంగా తమ తల్లిని కోల్పోగా, మరో 90,751 మంది పిల్లలు తమ తండ్రిని పోగొట్టుకున్నారు. ఇటువంటి పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ప్రతి దేశంలో అదనపు మరణాలను లెక్కించాలని, భవిష్యత్తులో వచ్చే విపత్తులను ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థను సిద్ధం చేయడానికి, తదుపరి మరణాలు సంభవించకుండా చూసేందుకు ఇది అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. అమెరికా, బ్రెజిల్ తరువాత అధిక మరణాలలో భారతదేశం ఇప్పటికే మూడో స్థానంలో ఉంది. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ నివేదిక వెలువడంతో మరణాలపై దేశ వ్యాప్తంగా ఆడిట్ జరపాలన్నది నిపుణుల మాట. మూడవ దశ కరోనా ముప్పు మన ముందుకొచ్చిన ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి సమర్ధవంతమైన చర్యలు చేపట్టాలి. వాస్తవాల ప్రాతిపదికగా మాత్రమే సమగ్రమైన వ్యూహాన్ని రూపొందించడం, సాధారణ ప్రజలను మొదలుకొని ప్రాణాలు నిలిపే వైద్యులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లకు దిశా నిర్దేశం చేయడం సాధ్యమవుతుంది. మోడీ ప్రభుత్వం బుకాయింపులు మాని కోవిడ్ మరణాలను క్షేత్రస్థాయి వాస్తవాలనుబట్టి నిర్ధారించి, అధికారికంగా ప్రకటించాలి. మృతుల కుటుంబాలకు పరిహారమివ్వాలి.










