May 20,2022 06:40

మసిబారిన గోడలు, శిథిలాల కుప్పలతో కనిపిస్తున్న ఆ ప్రాంతంలో ఎందరో అభాగ్యుల జీవితాలు కాలి బుగ్గయ్యాయి. ఆనవాళ్లు కూడా దొరకని వారి శరీరాలు సజీవ సమాధయ్యాయి. గాయాలతో ఆస్పత్రిలో చేరిన శరీరాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఆచూకీ తెలియని వారి జాడ కోసం ఆప్తులు పడిగాపులు కాస్తున్నారు. ఈ ఘోరకలికి బలై తీరని ద్ణుఖంలో మునిగిపోయిన ఆ కుటుంబాలు ఆప్తుల ఆనవాళ్ల కోసం బూడిదలో దేవులాడుతున్నాయి.
పూజ(19) మూడు నెలల క్రితమే పనిలో చేరింది. ఆమెతో పాటు తల్లి చెల్లి ఉంటారు. తండ్రి లేని కుటుంబానికి పూజ పెద్దదిక్కైంది. చెల్లి చదువు కోసం అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మ మందుల కోసం కూలీకి వెళ్లని తప్పని పరిస్థితి. తెచ్చిన కాస్తంత జీతంలోనే కలోగంజో పోసుకుని రోజులు గడుపుతున్నారు. ఇంతలోనే వారు కలలో కూడా ఊహించని ఘటనతో పూజ బతికుందో లేదో తెలియని అయోమయంలో ఆ తల్లీ కూతుళ్లు రోజూ ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు.
నిషా(18) పాఠశాల చదువు పూర్తయిన దగ్గర నుంచి కుటుంబం కోసం కష్టపడుతోంది. మీరాదేవి సంతానంలో పెద్ద కూతురుగా తండ్రి తరువాత కుటుంబ బాధ్యతను మోస్తున్న నిషా అంటే చుట్టుపక్కల వారికి వల్లమాలిన అభిమానం. 'మేమెవరమూ పని చేయమని ఆమెను బలవంతం చేయలేదు. కాని ఆర్థికంగా కుటుంబానికి సాయంగా ఉండాలని తనే పని వెతుక్కుంది. చాలా కష్టపడేది. నెలకు కేవలం రూ.7500 ఇచ్చేవారు. అయినా పనికి వెళ్లకుండా ఉండేదికాదు. అలాంటిది ఈ రోజు ఈ మృతదేహాల గుట్టలో నా కూతురును వెతుక్కుంటున్నాను. కాలి బూడిదైన ఈ శరీరాలు ఎవరివో... ఏ కన్నతల్లివో... ఏ గారాల బిడ్డవో అర్థం కాకుండా ఉంది' అంటూ భోరున విలపిస్తోంది మీరాదేవి. నిషా స్నేహితురాలు యశోదా దేవి మరణించిన వారి జాబితాలో ఉందని కుటుంబసభ్యులు గుర్తించారు. యశోద(30) నాలుగేళ్లుగా అక్కడ పనిచేస్తోంది. నిషాను పనిలో పెట్టింది కూడా ఆమే. చిన్న అద్దె ఇంట్లో ముగ్గురు పిల్లలతో యశోద కుటుంబం జీవిస్తోంది. 'ఆ పని ప్రదేశంలో కఠిన నియమాలు అమలుచేస్తున్నారు. భోజనవిరామ సమయంలో తప్ప మిగిలిన సమయంలో సెల్‌పోన్స్‌ ఉపయోగించకూడదు. విషయం తెలిసి మేము ఫోను చేస్తూనే ఉన్నాం. అది స్విచ్ఛాప్‌ వచ్చింది. ఆ తరువాత పోలీసులు గుర్తించిన మృతదేహాల్లో ఆమె ఉంది. తను వేసుకున్న నగలను బట్టి ఆమెను గుర్తించాం' అంటున్నారు విషాదవదనంతో ఆమె బంధువు.
ఈ భవనంలో పనిచేస్తున్నవారిలో అత్యధిక మంది భాగ్య విహార్‌ ప్రాంతం నుంచే వస్తున్నారు. భవనం సమీపంలో ఒక వ్యక్తి కనిపించిన వారందరికీ 8 మంది అమ్మాయిల పేర్లు ఉన్న ఓ కాగితం చూపిస్తూ 'వీరంతా నాకు తెలుసు. కుటుంబం కోసం కష్టపడుతున్నారు. ఇక్కడ జరిగిన ప్రమాదంలో వారంతా కాలి బూడిదయ్యారు. కన్నబిడ్డలను కోల్పోయిన వారి తల్లిదండ్రులు తమ ఇంటి దీపాలు ఆరిపోయాయని ఏడ్వని రోజు లేదు' అంటూ ఉద్వేగంగా మాట్లాడుతున్నాడు.
దేవి కూతురు స్వీటీ(25) ఆచూకీ తెలియక అప్పుడే వారం గడిచిపోయింది. ఇద్దరు బిడ్డల తల్లి అయిన స్వీటీ పిల్లలను మంచి చదువులు చదివించుకోవాలని పనిలో చేరింది. బీహార్‌ నుంచి ఈ కుటుంబం బతుకుతెరువు కోసం ఢిల్లీ చేరింది. భాగ్యవిహార్‌లోనే ఈ కుటుంబం నివసిస్తోంది. కూతురు పరిస్థితి గురించి తండ్రికి ఇప్పటివరకు తెలియదు. కళ్ల ముందు పసికందులు కనబడుతున్నా, కన్నబిడ్డ సమాచారం లేక ఆ తల్లి గుండె తల్లడిల్లుతోంది.
దృష్టి(26) మరో ఆరు నెలల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉంది. అమన్‌ కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. ఈ ప్రమాదంలో తను కూడా ఉంది. 'ఆచూకీ గల్లంతైన జాబితాలో తన పేరు కూడా ఉంద'ని చెమ్మగిల్లిన కళ్లతో అమన్‌ చెబుతున్నాడు.
ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌ నుంచి వచ్చిన వలస కార్మికుడు నసీమ్‌ అన్సారీ(33) తన భార్య ఆసియా ఆచూకి కోసం ఆమె ఫొటో పట్టుకుని పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. పని ప్రదేశంలో జరిగిన ఓ ప్రమాదంలో నసీమ్‌ చేతి రెండు వ్రేళ్లు తెగిపోయాయి. దీంతో అతనికి ఎవరూ పని ఇవ్వడం లేదు. కుటుంబ పోషణ కోసం ఆసియా పనికి వెళ్తోంది. ఈ ప్రమాదంలో బలైంది. తల్లి పోయిందన్న వార్త తెలిస్తే తన పిల్లలు ఏమై పోతారోనని నసీమ్‌ భోరున ఏడ్చేస్తున్నాడు.
దేశరాజధాని ఢిల్లీ నగరంలో ముంద్కా అగ్నిప్రమాదంలో మరణించిన, ఆచూకీ లభ్యంకాని వారంతా పొట్ట చేతబట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారే. ముఖ్యంగా కుటుంబ పోషణను తమమీద వేసుకుని భరిస్తున్న మహిళలు, యువతులే అధికంగా ఉన్నారు. చనిపోయిన కుటుంబాలకు పరిహారంగా రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలను ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 'ఆ డబ్బు మాకెందుకు? ఇక్కడ బిడ్డలు వారి తల్లులను కోల్పోయారు. తల్లులు వారి బిడ్డలను పోగొట్టుకున్నారు. ఆ సొమ్ము మా ఆప్తులను తిరిగి తీసుకురాగలదా? ఈ అగ్గిలో మాడి మసై పోయినవి శరీరాలు కాదు.. మా బతుకులు... మా ఆశలు, మా కలలు, మా భవిష్యత్తు ఈ బూడిద కుప్పలో కూరుకుపోయాయి' అంటున్న కుటుంబ సభ్యుల ఆర్తానాదాలు మిన్నంటుతున్నాయి.
ప్రమాదం జరిగిన నాలుగంతస్తుల భవనం నివాసప్రాంతంగా కాగితాల్లో నమోదై ఉంది. దీంతో ఫ్యాక్టరీ లైసెన్స్‌, అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ పొందకుండానే మూడు అంతస్తుల్లో లాజిస్టిక్స్‌ సంస్థకు చెందిన కోఫ్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, లీజర్‌ కోఫ్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో వందమందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. సిసిటివి కెమెరాలు, వైఫై రూటర్లు, సర్క్యూట్‌ అడాప్టర్లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను సమీకరించడం, ప్యాకింగ్‌ చేయడంలో వారంతా నిమగమై ఉంటారు. మే 13 శుక్రవారం సాయంత్రం సంభవించిన ఈ పెను ప్రమాదంలో తమను తాము రక్షించుకునేందుకు కిటికీల నుంచి సగం కాలిన శరీరాలతో కిందకి దూకుతున్న మహిళలు, యువతులు కనిపించారని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అనడానికి ఆ దృశ్యాలే సజీవ సాక్ష్యాలు. ప్రాథమికంగా 27 మంది మరణించారని నిర్ధారిస్తే వారిలో 21 మంది మహిళలు ఉన్నారని తేలింది. మూడు రోజుల తరువాత 29 మంది ఆచూకీ లేదని వార్తలు వస్తే వారిలో 24 మంది మహిళలే.
ఈ పాపం ఎవరిది? ప్రమాద నివారణ చర్యలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్న యజమానులదా? వారికి అనుమతులిచ్చిన పాలకులదా? ఈ సంఘటన ఒక్క ఢిల్లీకే పరిమితం కాదు. దేశంలో ఎన్నో ఫ్యాక్టరీల్లో ప్రమాదవశాత్తూ మరణిస్తున్న కార్మికుల కుటుంబాలు అనేకం ఉన్నాయి. 2019లో అనాజ్‌ మండి ప్రాంతంలోని ఒక కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో 44 మంది మరణించిన తరువాత ఇదే అతిపెద్ద ప్రమాదమని చెబుతున్నారు. అంతకుముందే 1997లో ఉపహార్‌ సినిమా థియేటర్‌ ప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం గుర్తులు ఇంకా చెరిగిపోలేదు. ప్రమాదం యజమానికి ఒక సంఘటన మాత్రమే.. బాధిత కుటుంబానికి అదో పెను తుపాను. అది సృష్టించే కల్లోలం వారిని జీవితాంతం వెంటాడి వేధిస్తుంది.

(ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌)