ప్రజాశక్తి - పరవాడ
పరవాడ ఎన్టీపీసీ సింహాద్రి కొత్తగా అభివృద్ధి చేసిన బూడిద ఆధారిత నిర్మాణ ఉత్పత్తులపై చర్చించడానికి, తెలుసుకోవడానికి వాటాదారుల కోసం కస్టమర్ సమ్మేళనాన్ని గురువారం నిర్వహించారు. దీనిని సింహాద్రి చీఫ్ జనరల్ మేనేజర్ జిసి.చౌక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌టిపిసి ప్లైయాష్‌తో బూడిద సంబంధిత నిర్మాణ ఉత్పత్తులైన నానో కాంక్రీట్ కంకర, సహజ రాయి కంకర, జియో పాలిమర్ ముతక కంకర, యాష్ టు సాండ్, లైట్ వెయిట్ అగ్రిగేట్ వంటివి ఎన్‌టిపిసి అభివృద్ధి చేసినట్లు చెప్పారు. నానో కాంక్రీట్ కంకరపై విశాఖలోని ఈన్ సావర్బ్ ల్యాబ్స్ డైరెక్టర్ ఎన్.కాళిదాస్ టెక్నికల్ సెషన్‌ను సమర్పించారు. ఈ సందర్భంగా బూడిదతో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టిపిసి జనరల్ మేనేజర్ (ఓ అండ్ ఎం) ఎస్‌కె సిన్హా, యాష్ వినియోగదారులతో పాటు కళాశాలల నుండి అధ్యాపకులు, ఎన్‌టిపిసి అధికారులు పాల్గొన్నారు.










