May 18,2023 00:18

బొజ్జన్న కొండ వద్ద బర్మాకు చెందిన శాస్త్రవేత్తలు

ప్రజాశక్తి-అనకాపల్లి : ప్రముఖ బౌద్ధ ఆరామం బొజ్జన్న కొండకు బుద్ధిజంపై పరిశోధనకు బుధవారం బర్మా నుంచి పరిశోధనా శాస్త్రవేత్తలు వచ్చారు. ప్రధానంగా ఇక్కడున్న పురాతన హీనయాన, మహాయాన, వజ్రయాన వంటి ప్రధాన స్థూపాలతో పాటు అనేక ఆనవాళ్లను పరిశీలించారు. మయన్మార్‌లోని మత వ్యవహారాలు, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుండి అధికారిక ప్రతినిధి బృందం పర్యటన కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆంధ్ర ప్రదేశ్‌ తెలియజేసింది. ప్రముఖులకు తగిన వసతి కల్పించాలని అభ్యర్థించింది. డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌్‌ న్యోమింట్‌ టున్‌, డైరెక్టర్‌ క్యావ్మియో విన్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్లు మన్‌ థిట్‌నైన్‌, టున్‌టున్‌ అయే, ఫియోప్యాకోకో, మే మయాట్‌నోకో మయన్మార్‌ నుండి వచ్చారు. ముందుగా విశాఖ వచ్చి అక్కడ గల తొట్లకొండ, బావికొండ, పావురాల కొండ తదితర ప్రాంతాలు సందర్శించిన అనంతరం అనకాపల్లి బొజ్జన్న కొండను పూర్తిగా పరిశీలించారు. పూర్వపు చరిత్ర కలిగిన ఆనవాళ్లను వారు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి దాసు, కార్య నిర్వహణ అధికారి నవీన్‌, పీలా మహౌదయా, గైడు పసుపులేటి రామకృష్ణ పాల్గొన్నారు.