Nov 01,2023 23:37

అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూన్న డాక్టర్‌ బి.శరత్‌


ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌
సైన్స్‌ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తూ, సైన్స్‌ చెప్పే సత్యాలను మాత్రమే విద్యార్థులు పాటించాలని జన విజ్ఞాన వేదిక డాక్టర్‌ బి.శరత్‌ అన్నారు. బుధవారం స్థానిక వాగ్దేవి జూనియర్‌ కళాశాలలొ జెవివి ఆధ్వర్యంలో శాస్త్రీయ విజ్ఞానం అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజరైన డాక్టర్‌ బి. శరత్‌ మాట్లాడుతూ విద్యార్థులు బట్టి విధానానికి స్వస్తి పలికి, అవగాహనతో చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా రాణించాలన్నారు. అంతరిక్షంలోకి రాకెట్లను పంపే సాంకేతికత పెరిగినా నేటికీ ప్రజల్లో మూఢనమ్మకాలు ఉన్నాయన్నారు. ఆర్థికంగా నష్టం చేకూర్చే అలాంటి మూఢనమ్మకాలను విడిచిపెట్టాలన్నారు. విద్యార్థులు తమ సబ్జెక్టులోని సందేహాలను నివత్తి చేసుకుంటూ చదివి ముందంజలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞానవేదిక జిల్లా నాయకులు ఏనుగుల రవికుమార్‌, వాగ్దేవి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కైపు సుబ్బారెడ్డి, డైరెక్టర్లు గొలమారి శివారెడ్డి, అడుగుల మోహన్‌, కొత్త శ్రీనివాసులు, పోతిరెడ్డి రవికుమార్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.