బటన్ నొక్కుడే...
డబ్బెక్కడ..?
జమకాని నాలుగో విడత 'విద్యాదీవెన'
బకాయిలు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు చేతికి..
ప్రజాశక్తి - తిరుపతి టౌన్
తిరుపతి సమీపంలోని ఓ కళాశాలలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్ధి బెంగుళూరులో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ధ్రువపత్రాల కోసం జూన్‌లో కళాశాలకు దరఖాస్తు చేయగా అప్పటికి విద్యాదీవెన నగదు రెండు విడతలు మాత్రం జమ అయ్యింది. మిగతా రెండు విడతలు మీ తల్లి బ్యాంకు ఖాతాకే జమ అవుతుంది కనుక ముందస్తుగా ఆ బకాయిలు చెల్లించాలని కళాశాల నిర్వాహకులు సూచించారు. చేసేదేమి లేక ఆ విద్య్ధార్ధి తల్లిదండ్రులు బయట వ్యక్తుల వద్ద వడ్డీకి అప్పు తెచ్చి ఫీజు జమ చేశారు. చాలామంది విద్యార్ధులది ఇదే పరిస్థితి. జగనన్న విద్యాదీవెన నగదు జమ కాకపోవడంతో కొలువులు సాధించిన వారు, పైకోర్సులో చేరాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగో విడతగా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ 30కోటు పైనే ఉన్నట్లు సమాచారం. డిగ్రీ, బీటెక్ ఇతర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం ఏటా నాలుగువిడతల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందజేస్తుంది. క్రమం తప్పకుండ ఆ మొత్తం ఇస్తున్నట్లు పాలకులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కొత్త విద్యాసంవత్సరం ఆరంభమై నాలుగు నెలలు గడిచినా గత ఏడాదికి సంబంధించిన చివరి విడత లబ్ధి ఇంతవరకూ విద్యార్దుల తల్లుల ఖాతాలకు జమకాలేదు. దీంతో ఏప్రిల్‌లోనే ఇంజినీరింగ్ చివరి సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాంగణ ఎంపికల్లో కొలువులు సాధించిన వారు సదరు కంపెనీలో చేరేందుకు ధ్రువపత్రాలు అవసరం. సకాలంలో డబ్బులు చెల్లించి మార్కుల జాబితాలు తీసుకెళుతున్నారు. ఆపై కోర్సుల్లో చేరిన వారిదీ ఇదే పరిస్థితి. రెండో సెమిష్టర్ వారికి అవస్థలు తప్పడం లేదు. ఫీజు మొత్తం చెల్లిస్తేనే సెమిష్టర్ పరీక్షలు రాసేందుకు అనుమతిస్తామని జిల్లాలో పలు కళాశాలల యజమాన్యాలు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఆర్ధిక వెసులుబాటు ఉన్న వారు ఫీజు బకాయిలు చెల్లింస్తుండగా, పేద పిల్లలకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు.
గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో ఇచ్చిన ట్యూషన్ ఫీజులను, వైసిపి అధికారంలోకి వచ్చాక జగనన్న విద్యాదీవెన పేరుతో అమలు చేస్తోంది. అందులో భాగంగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసి, తరువాత వారు కళా శాలలకు చెల్లించేలా పథకం అమలవు తోంది. గత విద్యా సంవత్సరానికి (2022 -23) సంబంధించి ఇప్పటి వరకు మూడు విడతల సాయం మాత్రం విడుదల చేశారు. అందులో తొలి రెండు విడతలు మార్చి 19, మే 4న జమచేయగా, మూడో విడత మాత్రం విద్యాసంవత్సరం ముగిసిన కొద్దిరోజులకు ఆగస్టు28 న జమ చేశారు. నాలుగో విడత మాత్రం ఇంక ఇవ్వలేదు. మరి కొంత సమయం పట్టే అవకాశాం ఉందని అధికార్లు భావిస్తున్నారు. దీంతో ఆయా కోర్సులు పూర్తి చేసిన పేద విద్యార్ధులు ధ్రువపత్రాలు అందక ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు నిధుల విడుదలలో చోటుచేసుకున్న తీవ్ర జాప్యం కారణంగా ఫీజు బకాయిలు పేరుకుపోతున్నాయి. కళాశాల నిర్వహణ కష్టంగా మారిందని యజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత విద్యా దీవెన నిధులు వారి ఖాతాల్లో జయ చేయాలని లబ్దిదారులు కోరుతున్నారు.
ఇంకెన్నాళ్లీ నిరీక్షణ..?










