ప్రజాశక్తి - నందవరం
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే వర్షాలు రావని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారని, ఒక్కసారి బటన్ నొక్కి వర్షాన్ని తెప్పించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ.జయ నాగేశ్వర రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని హాలహర్వి, మాచాపురం, గురజాల, నందవరం గ్రామాల్లో పర్యటించారు. హాలహర్వి గ్రామ సమీపంలోని దేశారు చెరువును పరిశీలించి, వైసిపి తీరుపై, వైసిపి ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమది రైతు ప్రభుత్వమని వైసిపి నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వైసిపి రైతు దగా ప్రభుత్వమని మండిపడ్డారు. చెరువులో నీరు లేకపోవడం వల్ల సుమారు 600 ఎకరాలు బీళ్లుగా మారాయని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు చెరువును నింపి రైతులకు నీరివ్వాలని చెప్పారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు, చిలకలడోన ఎత్తిపోతల పథకం అధికారులు ఎత్తిపోతల పథకం కడగొమ్ము (అడ్డు గోడ) సుమారు 1 అడుగు ఎత్తు పడగొట్టడం దారుణమని విమర్శించారు. కడగొమ్ము పడగొట్టడాన్ని నిరసిస్తూ న్యాయపోరాటం చేస్తామన్నారు. గురజాల గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కురువ బీరప్ప కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, టిడిపి తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చి, రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. గురజాల, రాయచోటి గ్రామాల మధ్య తుంగభద్ర నదిని పరిశీలించారు. టిడిపి సీనియర్ నాయకులు ఈరన్న గౌడ్, నాగరాజ్ గౌడ్, ఖాసీం వలి, రైస్ మిల్ నారాయణ రెడ్డి, గజేంద్ర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్, శంకరమ్మ, దావీదు, వీరేష్, బడేసాబ్, గణేష్, ఈసా పాల్గొన్నారు.
కడగొమ్మును పరిశీలిస్తున్న బీవీ










