ప్రజాశక్తి-గుంటూరు : సిపిఎం అగ్రనాయకులు, పొలిట్‌బ్యూరో మాజీ సభ్యులు, మార్క్సిస్టు సిద్ధాంతకర్త మాకినేని బసపున్నయ్య స్ఫూర్తితో ప్రజా పోరాటాలను విస్తృతం చేయాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో బుధవారం మాకినేని బసవపున్నయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చితప్రటానికి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతంలోని తూర్పు పాలెంలో జన్మించిన బసవపున్నయ్య జాతీయో ధ్యమ స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరార న్నారు. తన జీవితాంతం కష్టజీవుల ఉద్ధరణ కోసం పాటుపడ్డారని, కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన అతివాద, మితవాద విచ్ఛిన్నకర ఉద్యమాకుల వ్యతిరేకంగా నిలిచి సిపిఎంను బలోపేతం చేయడంలో ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కెఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ సిపిఎం కార్యక్ర మాన్ని, ఎత్తుగడల పంథాను రూపొందించడంలో బసవపున్నయ్య కీలకపాత్ర పోషించారన్నారు. మార్క్సిజాన్ని మన దేశ పరిస్థితులుకు అన్వయించి పార్టీ అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్ వంట గ్యాస్ ధరలు పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని, భారత రాజ్యాంగ మౌళిక సూత్రాలను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ఈ స్థితిలో బసవపున్నయ్య స్ఫూర్తితో ఉద్యమించడమే వారికి నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) రెడ్‌స్టార్ పోలిట్‌బ్యూరో సభ్యులు మన్నవ హరిప్రసాద్, ప్రజాపోరు జిల్లా నాయకులు కొటేశ్వరరావు, ఎంసిపిఐ (యు) నాయకులు కె.శ్రీధర్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, కె.నళినీకాంత్, నల్లమడ రైతు సంఘం నాయకులు ఎన్.ఆచారి, కె.హరిబాబు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-సత్తెనపల్లి : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మాకినేని బసవ పున్నయ్య కీలకపాత్ర పోషించారని సిపిఎం సీనియర్ నాయకులు గద్దె చలమయ్య అన్నారు. స్థానిక పుతుంబాక భవన్లో నిర్వహించిన వర్ధంతి సభలో బసవపున్నయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చలమయ్య మాట్లాడుతూ స్వాతంత్ర అనంతరం భారతదేశంలో విప్లవ పంథా ఎలా ఉండాలి అనే దానిపై కార్యక్రమాన్ని రూపొందించిన వారిలో మాకినేని బసవ పున్నయ్య ఒకరని అన్నారు. 12 ఏళ్లు రాజ్యసభ సభ్యులుగా పనిచేసి అఖిలభారత రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, మండల కార్యదర్శి పి.మహేష్, నాయకులు కె.శివదుర్గారావు, జి.బాలకృష్ణ, జి.రజిని, జె.రాజకుమార్, సిపిఐ నాయకులు నరిశేటి వేణుగోపాల్, ఇర్మియ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-ఫిరంగిపురం : మండలంలోని పొనుగుపాడులో వర్ధంతి సభకు జివి రావు అధ్యక్షత వహించగా సిపిఎం మండల కార్యదర్శి ఎస్.ఎం.వలి మాట్లాడారు. ఖాజా, మస్తాన్‌వలి, హరిబాబు, కోటేశ్వరరావు, ఫణి కుమార్ పాల్గొన్నారు.










