ప్రజాశక్తి - చీరాల
చీరాల ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్న సమయంలో బస్టాండులో బస్సు ఎక్కే సమయంలో బస్టాండ్ పిట్టగోడ స్లాబు ఊడి ఓ బాలుడిపై పడటంతో తీవ్రగాయాలయ్యాయి. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామానికి చెందిన బిళ్ల మున్నా తన కుటుంబ సభ్యులు బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి కారంచేడు వెళ్లేందుకు చీరాల బస్టాండుకు వచ్చారు. అక్కడ స్టాండ్లో కుంకలమర్రు గ్రామానికి వెళ్లేందుకు బస్సును ఎక్కబోతున్నారు. అదే సమయంలో పిట్టగోడ స్లాబు పెచ్చులు ఊడి బస్సుపై పడి పెద్ద శబ్దాలతో అక్కడి నుంచి బస్సు ఎక్కబోతున్న మున్నా అనే బాలుని తలపై పడ్డాయి. దీంతో బస్సు ఎక్కే ప్రయాణికులు ఒక్కసారిగా బయాందోళన చెంది పరుగులు తీశారు. తీవ్రగాయాలైన మున్నాను కుటుంబ సభ్యులు చీరాల ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మున్నాకు వైద్యు సిబ్బంది చికిత్స చేశారు. తలకు ఆరు కుట్లు వరకు పడినట్లు సిబ్బంది తెలిపారు. కొన్నిరోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు స్లాబు పెచ్చులు రాలి పడుతున్నా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవటం లేదని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ డీఎం జె శ్యామల ఆసుపత్రికి వచ్చి బాలుడిని పరామర్శించారు.










