Feb 28,2023 22:56

ప్రజాశక్తి-జగ్గయ్యపేట: జగ్గయ్యపేట మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా జరిగింది. ఆర్టీసీ బస్టాండ్‌లో అనుమతి లేకుండా మాజీ సర్పంచ్‌ సామినేని విశ్వనాథం విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై మంగళవారం జరిగిన సమావేశంలో టిడిపి కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నకు వైసిపి కౌన్సిలర్లు సమాధానం ఇవ్వకపోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. కౌన్సిలర్ల మధ్య ఘర్షణ జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కౌన్సిల్‌ సమావేశాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేంద్ర వాయిదా వేశారు. వైసిపి కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ పోడియం వద్ద టిడిపి కౌన్సిలర్లు ధర్నాకు దిగారు. దీంతో టిడిపి కౌన్సిలర్లను నెల రోజుల పాటు చైర్మన్‌ సస్పెండ్‌ చేశారు. చైర్మన్‌ ఆదేశాలతో టిడిపి కౌన్సిలర్లను జగ్గయ్యపేట స్టేషన్‌కు తరలించారు. టిడిపి జాతీయ కోశాధికారి శ్రీరాం రాజగోపాల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని కౌన్సిలర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌ మాట్లాడుతూ వైసిపి కౌన్సిలర్లే టిడిపి మహిళా కౌన్సిలర్ల మీదకు వచ్చి బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. కౌన్సిల్‌ హాల్లోకి పోలీసులు వెళ్లకూడదనే నిబంధనలు ఉన్నా టిడిపి కౌన్సిల్‌ సభ్యులను లాక్కొని వెళ్లారన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా న్యాయ పోరాటం చేస్తామన్నారు.
నియమాలు పాటించాలి : చైర్మన్‌
ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర విలేకరులతో మాట్లాడుతూ కౌన్సిల్‌ సమావేశంలో టిడిపి కౌన్సిలర్ల తీరు కౌన్సిల్‌ సభ్యులకు చెడ్డ పేరు తీసుకువచ్చేలా ఉందన్నారు. పోడియం వద్దకు దూసుకువచ్చి విచక్షణారహితంగా అరుస్తూ తోటి కౌన్సిలర్లను దుర్భషలాడారన్నారు. దీంతో టిడిపి కౌన్సిలర్లు 13 మందిని నెల రోజుల పాటు సస్పెండ్‌ చేయడం జరిగిందన్నారు. ఇక నుంచైనా కౌన్సిల్‌ సభ్యులు నియమాలు తెలుసుకుని వ్యవహరించాలన్నారు.