Oct 21,2023 21:14

సమావేశంలో మాట్లాడుతున్న వైసిపి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి

ప్రజాశక్తి - డెంకాడ : వైసిపి సామాజిక న్యాయ బస్సు యాత్రను విజయవంతం చేయాలని వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి కోరారు. మండలంలోని పెదతాడివాడ వద్ద నెల్లిమర్ల నియోజకవర్గ వైసిపి విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే బడ్డకొండ అప్పలనాయుడు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి ఎందుకు కావాలి కార్యక్రమం నంబరు ఒకటి నుంచి డిసెంబర్‌ 10వ వరకు ఉంటుందని, త్వరలో సామాజిక న్యాయ బస్సు యాత్ర నియోజవర్గంలో నిర్వహిస్తామని చెప్పారు. ఈరెండు కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు అధికారం కోసం గతంలో 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ 98శాతం నెరవేర్చడం జరిగిందన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడి కోట్లు సంపాదించి జైల్లో ఉన్నాడని తెలిపారు. గ్రామాల్లో ప్రతి కుటుంబాన్ని, వ్యక్తిని కలిసి జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఇలా చేయడం ద్వారా ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు విజయానికి దోహదపడుతుందని తెలిపారు. వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పేదవాని పక్షాన వైసిపి నిలబడి యుద్ధం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ సురేష్‌ బాబు, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు అందవరపు సూరిబాబు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, వివిధ కార్పొరేషన్‌ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.