
ప్రజాశక్తి-కొమరాడ : అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజారక్షణ బేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి.ఇందిర కోరారు.. ఈ మేరకు బుధవారం కొమరాడలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ 30న మధ్యాహ్నం 12 గంటలకు బస్సుయాత్ర కురుపాం చేరుకుంటుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, సిపిఎం నాయకులు హెచ్ రామారావు, ఎ.ఉపేంద్ర పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : ఈ నెల 30న నుంచి ప్రారంభమయ్యే సిపిఎం బస్సుయాత్ర విజయవంతం చేయాలంటూ గుమ్మ లక్ష్మీపురంలో ఆ పార్టీ నాయకులు మోటార్ సైకిళ్లతో ప్రచారం చేశారు. కురుపాంలో జరిగే బహిరంగ సభకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరవుతున్నట్లు సిపిఎం నాయకులు కోలక అవినాష్, మండంగి రమణ తెలిపారు. బహిరంగ సభకు ఐదు మండలాల్లోని ప్రజలంతా హాజరై జయప్రదం చేయాలని కోరారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల్లో మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.
పాచిపెంట : అసమానతలు లేని అభివృద్ధి కోసం ఈ నెల 30 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు చేపట్టే ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు మంచాల శ్రీనివాసరావు, పి.సన్యాసిరావు, కోరాడ ఈశ్వరరావు కోరారు. పాచిపెంటలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 31న మధ్యాహ్నం 12 గంటలకు సాలూరు పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరారు.