ప్రజాశక్తి-తాడిపత్రి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలు, బిజెపి విధానాలను తూచా తప్పకుండా పాటిస్తున్న వైసీపీ వైఖరిని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టనున్న బస్సుయాత్రపు జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎన్‌జిఒలో కార్మిక సంఘాల నాయకులతో కలిసి ప్రజా రక్షణ బేరి బస్సుయాత్రకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి రాష్ట్రాన్ని విభజించే సందర్భంలో అనేక హామీలు ఇచ్చిందన్నారు. ముఖ్యంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించమని, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లపాటు ఇస్తామని, కర్నూలులో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తామని, కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించిందన్నారు. ఇందుకోసం పోరాడాల్సిన రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కేంద్రానికి తలొగ్గి వారి ఆదేశాలనే పాటిస్తోందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని బిజెపిపై ఒత్తిడి తీసుకురాకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఆందోళనలు చేయడంలో విఫలమయ్యాయన్నారు. ఈనేపథ్యంలో బిజెపి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర వచ్చేనెల 1వతేదీన తాడిపత్రికి చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆరోజు తాడిపత్రిలోని మున్సిపల్ మార్కెట్ ఎదురుగా బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సభలో కార్మికులు, ఉద్యోగులు, కర్షకులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
పోస్టర్లను విడుదల చేస్తున్న సిపిఎం నాయకులు










