
ప్రజాశక్తి- పలాస: పలాస డిపో పరిధిలో ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నంకు తిరుగుతున్న 10 ఎక్స్‌ప్రెస్ బస్సులు నెల రోజులుగా నిలిపివేశారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పి.భూనుమతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్‌టిసి డిపో వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. అనంతరం పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును కలసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలను నిత్యం గమ్యస్థానాలకు చేరుస్తూ సేవలను అందిస్తున్న ఆర్‌టిసిని లాభ, నష్టాలతో సంబంధం లేకుండా నడుపుతామని చెప్పి ప్రభుత్వంలో విలీనం చేశారని అన్నారు. పలాస డిపో పరిధిలో నెల రోజుల నుంచి పది ఎక్స్‌ప్రెస్ బస్సులు. నిలిపివేశారని అన్నారు. దీనిపై డిపో మేనేజర్‌ని ఉద్యోగులు వివరణ కోరగా, నష్టాలు కారణంతో శ్రీకాకుళం డిపిటిఒ ఆదేశాల మేరకు ఆ పది బస్సులు నిలుపివేశామని తెలిపారని అన్నారు. ఈ బస్సులు నిలిపివేయడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. ప్రయివేటు ఆపరేటర్లకు లబ్ధిచేకూరే విధంగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. తక్షణమే బస్సుల పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో జోనల్ కార్యదర్శి బి.కె.మూర్తి. జిల్లా అధ్యక్షులు జి.త్రినాథ, జిల్లా కార్యదర్శి కె.దశరథుడు, డిపో నాయకులు ఎ.దిలీప్‌కుమార్, ఎం.ఎ.రాజు, చిన్న, ఎల్.డి.రావు, మెట్ట సూర్యనారాయణ పాల్గొన్నారు.