ప్రజాశక్తి-వడ్డాది
వడ్డాది వంతెన శిథిలమైన నేపథ్యంలో బస్సులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ వంతెన శిథిలమైన తర్వాత నర్సీపట్నం నుండి చోడవరం వెళ్లే బస్సులు వడ్డాది వంతెన అవతల వెంకటేశ్వరస్వామి ఆర్చి వరకే నడుస్తున్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే విద్యార్థులు, ప్రయాణికులు అక్కడ నుండి వడ్డాది జంక్షన్ వరకు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ మరో బస్సు ఎక్కాల్సి వస్తుంది. వంతెన ఖానాలు కుంగిన మొదటిలో వడ్డాది నుంచి చోడవరం వరకు ప్రత్యేక బస్సులు నడిపేవారు. వాటిని ఇప్పుడు నిలిపివేశారు. దీంతో చోడవరం, అనకాపల్లి కళాశాలలు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు బస్సులు కోసం గంటలు తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. మాడుగుల నుండి చోడవరం వైపు వెళ్లే బస్సులు తక్కువగా ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. ఉదయం 10 గంటల వరకు ఒక్క బస్సు కూడా రావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులున్న కొంతమంది ఆటోల్లో వెళ్తుండగా, మరి కొంతమంది సమయం మించి పోవడంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పందించి ఉదయం 9గంటల సమయంలో వడ్డాది నుండి చోడవరం వరకు బడి బస్సులు వేయాలని విద్యార్థులు కోరుతున్నారు.










