
ప్రజాశక్తి-తాడేపల్లి : సిపిఎం ప్రజా రక్షణభేరి బస్సు యాత్ర ఈ నెల 9వ తేదీ సాయంత్రం ఉండవల్లి సెంటర్‌కు రానున్న సందర్భంగా ఘనంగా స్వాగతం పలకాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. సిపిఎం తాడేపల్లి పట్టణ, రూరల్, రాజధాని విస్తృత సమావేశం స్థానిక మేకా అమరారెడ్డి భవన్‌లో మంగళవారం జరిగింది. సమావేశానికి పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. రామారావు మాట్లాడుతూ పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద నుంచి బస్సు యాత్రకు బైక్ ర్యాలీతో స్వాగతం పలుకుతారని చెప్పారు. అక్కడ నుంచి ఉండవల్లి సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ పాల్గొని మాట్లాడతారని తెలిపారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపితో వైసిపి, టిడిపి, జనసేన ఎందుకు మద్దతిస్తున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. విభజన హామీలను అమలు జరపకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని బొందలో పెట్టాలని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలు అమలు జరపని విద్యుత్ సంస్కరణలతో సహా అన్నింటినీ బిజెపి చెప్పినట్లు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తుందని మండిపడ్డారు. ఆస్తి, చెత్తపన్ను పెంచి ప్రజల నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో దేశం మొత్తం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రాజేస్తున్నా దేశంలో ఎక్కడా లేని విధగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఆ పార్టీ పంచన చేరడం సిగ్గుచేటన్నారు. పెరిగిన ధరలు సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రధానంగా రైతులకు అవసరమైన పెదవడ్లపూడి హైలెవల్ ఛానల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ ఛానల్ కింద పంటలు ఎండిపోయి రైతులు నష్టాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డ్రెయినేజీ సమస్య అస్తవ్యస్తంగా మారిందని, దీనిని వెంటనే సరిచేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రవి, సీనియర్ నాయకులు జొన్నా శివశంకరరావు, నాయకులు డి.శ్రీనివాసకుమారి, కె.కరుణాకరరావు, వి.దుర్గారావు, ఎ.శౌరిబర్తులం, కె.మేరి, డి.విజయబాబు పాల్గొన్నారు.
బహిరంగ సభ జయప్రదం కోసం సిపిఎం నాయకులు పలు ప్రాంతాల్లో కార్మికులు, ప్రజలను కలిసి కరపత్రాలు పంపిణీతో ప్రచారం చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, నాయకులు డి.శ్రీనివాసకుమారి, బి.గోపాలరెడ్డి, డి.యోహాన్, వి.వెంకటేశ్వరరావు, యు.పార్థసారధి, పి.శివయ్య, ఎస్.రాములు, మస్తానరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తెనాలి : సిపిఎం చేపట్టిన బస్సు యాత్ర గురువారం ఉదయం 9 గంటలకు తెనాలికి చేరనుందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.భావన్నారాయణ కోచెప్పారు. స్థానిక చెంచుపేట ప్రజాసంఘాల కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం అనేక మంది మేధావులు విద్యావేత్తలతో సిపిఎం పలు సదస్సులు నిర్వహించి ప్రణాళిక రూపొందించిందని, దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మూడు బస్సు యాత్రలను నిర్వహిస్తోందని అన్నారు. అందులో ఒక బస్సు యాత్ర గుంటూరు జిల్లాలో పర్యటిస్తుందని, గురువారం ఉదయం అన్నాబత్తుని పుర వేదిక వద్ద జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం 11 గంటలకు బస్సు యాత్ర గుంటూరుకు బయలుదేరుతుందని, అక్కడి నుంచి పెదకాకాని, కాజా, మంగళగిరి, తాడేపల్లి మీదుగా విజయవాడ చేరుకోవటంతో యాత్ర ముగుస్తుందని వివరించారు. మూడు బస్సు యాత్రలు విజయవాడ చేరుకున్న అనంతరం నవంబర్ 15వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుందన్నారు. సభలో ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సిపిఎం తెనాలి ఏరియా కార్యదర్శి కె.బాబుప్రసాద్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో విఫలమైన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో కాలువలకు నీరు సరిగా రాక మాగాణి భూములు ఎండిపోతున్నాయని, విద్యుత్ ఛార్జీలు పెరిగి ప్రజలు బాధలు పడుతున్నారన్నారు. ప్రజలపై మోపిన చెత్త పన్ను రద్దు చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం సీనియర్ నాయకులు ఎం.శివసాంబిరెడ్డి, షేక్ హుస్సేన్ వలి, పి.జోనేష్, ఎం.ఎలమందయ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి-గుంటూరు : ప్రజారక్షణ భేరి రాష్ట్ర బస్సు జాతా ఈనెల 9వ తేదీన గుంటూరు వస్తున్న సందర్భంగా ఉదయం 11 గంటలకు పాత బస్టాండ్ సెంటర్‌లో సభ నిర్వహిస్తున్నట్లు సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్ తెలిపారు. ఈ జాతాలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్ పాల్గొంటారన్నారు. మంగళవారం స్థానిక హిందూ కాలేజి కూడలిలోని ఆటో స్టాండ్ వద్ద ప్రజారక్షణ భేరి ఆటో స్టిక్కర్లను ఆవిష్కరించారు. పలు ఆటోలకు స్టిక్కర్లు అంటించారు. నళినీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో రూ.10వేలు నగదు ఇస్తుందని, అదే సందర్భంలో మరోవైపు ఇన్సూరెన్స్, ఫీజులు, పెనాల్టీల పేరుతో రెట్టింపు వసూలు చేస్తోందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను నీర్చుగార్చుతుందని, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను అరికట్టలేకపోతుందన్నారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచిందన్నారు. మరోవైపు ఉపాధి, నిరుద్యోగం పెరిగి, ప్రజల జీవనం అస్థవ్యస్థంగా మారిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజలపై భారాలు మోపుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విజయవాడలో 15వ తేదీన జరిగే జరిగే బహిరంగ సభను, గుంటూరులో 9న జాతా సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కె.శ్రీనివాస్, బి.ముత్యాలరావు, ఎ.నికల్సన్, మస్తాన్‌వలి, కొండలు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - దుగ్గిరాల : స్థానిక బోస్ బోసు బొమ్మసెంటర్, చెన్నకేశనగర్, శివాలయం సెంటర్, లూథరన్ చర్చి సెంటర్లో కరపత్రాలు పంపిణీతో ప్రచారం చేశారు. సిపిఎం మండల కార్యదర్శి జె.బాలరాజు మాట్లాడారు. బ్రహ్మేశ్వరావు, అమ్మిరెడ్డి, కృష్ణా నాయక్, సాంబనాయక్, రాములు నాయక్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - చేబ్రోలు : స్థానిక ఎస్టీ కాలనీ, చెరువులోపాలెంలో ప్రచారం చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.లక్ష్మీనారాయణ మాట్లాడారు. రవి, బి.కొండలు, బన్ను పాల్గొన్నారు.
ప్రజాశక్తి-మంగళగిరి : సభ పోస్టర్‌ను పట్టణంలోని 22 వార్డులోగల సింహాద్రి శివారెడ్డి భవనంలో ఆవిష్కరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్ చెంగయ్య, సీనియర్ నాయకులు పి.బాలకృష్ణ, నాయకులు ఎం.చంద్రశేఖరరావు, బి.స్వామినాథ్, ఆదినారాయణ, నాగేష్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : మండలంలోని చిన్నకాకానిలో ప్రచారం చేశారు. నాయకులు వి.పూర్ణయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.