Aug 22,2023 20:55

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఐ నాయకులు

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఐ నాయకులు
బస్సు యాత్ర ప్రచార జాత పోస్టర్ల విడుదల
-29న బహిరంగ సభ, జయప్రదం చేయాలి
ప్రజాశక్తి-నెల్లూరు:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర పేరుతో ప్రచార జాత నిర్వహిస్తున్నట్లు, ప్రచార జాత పోస్టర్లను స్థానిక సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం నాయకులు విడుదల చేశారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్రంలో వైసిపి నియంత పాలన సాగిస్తుందని విమర్శించారు. దేశాన్ని కాపాడండి..రాష్ట్రాన్ని రక్షించండి అనే నినాదంతో తమ పార్టీ ఆగస్ట్‌ 17వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 8వ తేదీ వరకు ప్రచార జాతను నిర్వహిస్తూన్నట్లు తెలిపారు.17వ తేదిన విశాఖపట్టణంలో ప్రచారజాత ప్రారంభ సభ నిర్వహించామని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ నేతత్వంలో ఈ ప్రజా జాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 29వ తేదీన ప్రచార జాత నెల్లూరుకు చేరుకుంటుందన్నారు. అనంతరం స్థానిక టౌన్‌ హాల్లో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్‌ సిరాజ్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ ప్రచార జాత నిర్వహిస్తుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఏపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ షాన్‌ వాజ్‌ మాట్లాడుతూ ఈనెల 29వ తేదీన స్థానిక బోసు బొమ్మ నుంచి సాయంత్రం ఐదు గంటలకు తమ పార్టీ ఆధ్వర్యంలో టౌన్‌ హాల్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ సీనియర్‌ నాయకులు రామరాజు, ఆంజనేయులు, సురేష్‌, నాగరాజు, ఇన్సాఫ్‌ జిల్లా అధ్యక్షులు అజీజ్‌ అహ్మద్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ ఎస్‌ కె.మున్నా, ఆదినారాయణ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జిలాని తదితరులు పాల్గొన్నారు.