బస్సు సౌకర్యం కల్పించాలి
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : రాముడుపాలెం మజారా పల్లిపాలెం గ్రామానికి వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి గుడిహరి కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని రామూడుపాలెం మజారా పల్లిపాలెం గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యల గురించి ఆయనతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్స్యకార గ్రామమైన ఈ గ్రామంలో కనీస అవసరాలైన రవాణా, విద్య, వైద్యం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకులకు ఎన్నికల అప్పుడు ఈ గ్రామస్తులు కనిపిస్తారు తప్పితే మిగతా అప్పుడు కనిపించరా అని ప్రశ్నించారు. ఆస్పత్రికి వెళ్లాలంటే 10 మైళ్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని గుర్తు చేశారు. కనీసం ఈ గ్రామంలో తాగడానికి నీళ్లు లేవని ప్రభుత్వానికి గత కొన్ని సంవత్సరాల నుంచి మొరపెట్టుకున్న ఏ నాయకుడు ఏ అధికారి ఈ గ్రామాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం కూడా తూ.తూ. మంత్రంగా జరిపి నాయుకులు చేతులు దులుపుకున్నారన్నారు. ఇకనైనా స్పందించి ప్రభుత్వం అధికారులు స్పందించి పల్లిపాలెం గ్రామస్తుల కష్టాలను తీర్చాలన్నారు. లేనిపక్షంలో పోరాటాలకు వెనుకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షులు మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు గుండాల మాధవరెడ్డి, అశ్వక్ వెంకట్రావు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










