Oct 31,2023 23:21

బస్సు కోసం వేచిఉన్న విద్యార్థులు

పెద్దదోర్నాల: దోర్నాల నుంచి బద్ద్వీడు చెర్లోపల్లికి సాయంత్రం ఐదు గంటల సమయంలో వెళ్లే బస్సు సర్వీస్‌ను రద్దు చేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కటకానిపల్లి, చింతల అగ్రహారం, చిన్న దోర్నాల, రామచంద్రపురం, జమ్మిదోర్నాల, బద్ద్వీడు చెర్లోపల్లి గ్రామాలకు చెందిన ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులు ఆర్‌టిసి బస్సుల్లో దోర్నాలకు చదువుకొని సాయంత్రం సమయంలో ఇంటికి వెళ్తుంటారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి విద్యార్థులకు బస్సు కోసం నిరీక్షించారు. 6:30 గంటల వరకూ బస్సు రావడంతో విద్యార్థులు ఆ బస్సులో తమ గమ్య స్థానాలకు వెళ్లారు. ఆర్‌టిసి బస్సులపైనే ఆధారపడి దోర్నాలకు వచ్చి చదువుకుంటున్నట్లు వెంగళరెడ్డి అనే విద్యార్థి తెలిపాడు. దసరా సెలవులు తర్వాత నుంచి సాయంత్రం 5 గంటలకు వచ్చే బస్సు రావడం లేదన్నారు. దీంతో విద్యార్థులు రెండు గంటల పాటు బస్సు కోసం నిరీక్షించాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ఆర్‌టిసి అధికారులు స్పందించి గతంలో మాదిరిగానే సాయంత్రం 5 గంటలకు బస్సును నడపాలని విద్యార్థులు కోరుతున్నారు.