
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీతారాం
ప్రజాశక్తి - భీమవరం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగట్టేందుకు ఏర్పాటు చేసిన రాజకీయ ప్రత్యామ్నాయ బస్సు జాతాలను విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. మెంటేవారితోటలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరంకుశ పోకడలను అవలంబిస్తోందన్నారు. లౌకికవాదాన్ని నాశనం చేసి ఫాసిస్టు విధానాలను తీసుకొస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు సిపిఎం ఆధ్వర్యంలో రాజకీయ ప్రత్యామ్నాయ ప్రచారంలో భాగంగా రెండు బస్సు జాతాలు నిర్వహిస్తోందన్నారు. ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా మందస నుంచి ప్రారంభమై నవంబరు 3న విజయవాడకు వస్తుందన్నారు. ఈ జాతా జిల్లాకు ఈ నెల 31న రాజోలు మీదుగా చించినాడ చేరుకుని నంబరు 2న ఉండి, ఆకివీడు మీదుగా కృష్జా జిల్లాకు వెళ్తుందన్నారు. బస్సు జాతాలో ప్రజలు కార్యకర్తలు, మేధావులు పాల్గొనాలని, ప్రభుత్వ నిరంకుశ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నవంబరు 7న విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ ఇంధన, గ్యాస్, వంట నూనె, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబూరావు, కేతా గోపాలన్, కౌరు పెద్దిరాజు, పి.ప్రతాప్, బి.వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.