Aug 28,2023 23:24
విద్యుత్‌ అమరవీరులకు నివాళులర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల: బషీర్‌బాగ్‌ విద్యుత్తు పోరాటంలో అశువులు బాసిన అమరవీరుల చిత్రపటాలకు సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో బాపట్ల పాత బస్టాండ్‌ ఆటోస్టాండ్‌ వద్ద నివాళు లర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ మజుందార్‌ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని జరిగిన ప్రజా పోరాటాన్ని అణిచివేసి ముగ్గురు కామ్రేడ్స్‌ను బలి తీసుకుందని అన్నారు. ఆనాడు విద్యుత్‌ పోరాటానికి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మద్దతు పలికారన్నారు. ప్రస్తుత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన విద్యుత్‌ చార్జీల భారం మోపుతోందని అన్నారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి జె శామ్యూల్‌, సిఐటియు నాయకులు వాసు, బ్రహ్మం పాల్గొన్నారు.
రేపల్లె: విద్యుత్‌ ఉద్యమంలో 2000 సంవత్సరంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన అమరవీరులు రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామిలకు స్థానిక సీపీఎం కార్యాల యంలో పట్టణ కార్యదర్శి సీహెచ్‌ మణిలాల్‌ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పెరుగుతున్న విద్యుత్‌ భారాలకు నిరసనగా, విద్యుత్‌ అమరవీరుల దినోత్సవం స్ఫూర్తితో ప్రజలు ఉద్యమాల్లో ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ముందుగా విద్యుత్‌ అమరవీరుల చిత్రపటాలకి పూలమాలలతో నివాళి అర్పించారు. విద్యుత్‌ పోరాట అమరవీరుల త్యాగాలు వృథా కాలేదని, వారి పోరాట ఫలితంగా రాష్ట్రంలో ఏడేళ్ల పాటు విద్యుత్‌ చార్జీలు పెంచలేదని అన్నారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సర్దుబాటు చార్జీలు, ట్రూ అప్‌ చార్జీల పేరుతో దుర్మార్గంగా ఎప్పుడుపడితే అప్పుడు చార్జీలు పెంచుతోందని విమర్శించారు. వర్షాకాలంలో కూడా అప్రకటిత కోతలు విధిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ పాలసీపై సీపీఎంగా దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె ఆశీర్వాదం, కెవి లక్ష్మణరావు, జె ధర్మరాజు, డి శ్రీనివాసరావు, సిహెచ్‌ ఆగస్టీన్‌ తదితరులు పాల్గొన్నారు.