May 24,2023 23:44

పరిశీలిస్తున్న సురేంద్ర, బాలదేవ్‌

ప్రజాశక్తి- అరకులోయ:అరకులోయ ఆర్టీసీ కాంప్లెక్స్‌ లో కనీస సదుపాయాలు కల్పించాలని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్‌ దేవ్‌ డిమాండ్‌ చేశారు. అరకులోయ అసెంబ్లీ, పార్లమెంట్‌ కేంద్రంలో ఉన్న ఏ.పీ ఎస్‌.ఆర్‌,టి.సి బస్‌ కాంప్లెక్స్‌లో కనీసం మంచినీటి, మరుగుదొడ్లలో రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం లేక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆర్టిసి కాంప్లెక్స్‌లో వారు సందర్శించి పరిశీలించారు. మంచినీటి సదుపాయం లేకపోవడంతో వేసవిలో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరుగుదొడ్లు అలంకార ప్రాయంగా ఉన్నాయని, ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గం కేంద్రంలోని ఆర్టిసి కాంప్లెక్స్‌ లో ఇటువంటి పరిస్థితి ఉండటం శోచనీయమన్నారు. ఈ ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌ వద్ద నుంచి ఎస్‌కోట, విశాఖ, పాడేరుకు రోజుకు 1500 మంది ప్రయాణికులు వెళుతుంటారన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన అరకులలో ఇటువంటి పరిస్థితి ఉండటం ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతుందని వారు తెలిపారు. మరుగుదొడ్లలో రన్నింగ్‌ వాటర్‌ లేకపోతే ఫలితమేముందని వారు ప్రశ్నించారు. ప్రయాణికుల ఇబ్బందులను దష్టిలో పెట్టుకుని తక్షణమే బస్‌ కాంప్లెక్స్‌ లో తాగునీరు, మరుగుదొడ్లు వినియోగంలోకి తేవాలని డిమాండ్‌ చేశారు.కనీస సౌకర్యాలు కల్పించకుంటే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.