ప్రజశక్తి-చీరాల
హైర్ బస్సు డ్రైవర్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేశాడు. బాధిత డ్రైవరు శివయ్య ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. డ్రైవరుపై దాడిచేసిన ప్రయాణికుడు శ్రీనివాసరావును వెంటనే అరెస్టు చేసి డ్రైవర్, కండక్టర్లకు రక్షణ కల్పించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక ఆర్టీసీ డిపో ఆవరణంలో హైయర్ బస్సు సర్వీసులను నిలిపివేసి సిఐటియు ఆధ్వర్యంలో డ్రైవర్లు, కండక్టర్లు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు ఏన్ బాబురావు, ఎం వసంతరావు మాట్లాడుతూ హయ్యర్ బస్సు డ్రైవర్ శివయ్య తన విధుల్లో భాగంగా ప్రయాణికులను ఎక్కించుకొని ఆదివారం విజయవాడ నుంచి చీరాల డిపోకు బయలుదేరారని అన్నారు. విజయవాడ కష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద బస్సు ఆపాలని విజయవాడ గౌతమి విద్యాసంస్థలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న చీరాల ఈపురుపాలేనికి చెందిన ఊట్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి తన కారులో వస్తూ డ్రైవర్‌కు సైగలు చేశారన్నారు. అయితే ట్రాఫిక్ నిబంధనల రీత్యా తక్షణం బస్సు నిలిపేందుకు వీలుకాకపోవడంతో బస్సును కొంతదూరం తీసుకువెళ్లి ఆపాడన్నారు. దీంతో బస్సు ఎక్కిన శ్రీనివాసరావు డ్రైవర్‌తో వాదిస్తూ తానెవరో తెలుసా అంటూ ఘర్షణ పడ్డాడు. తన భార్య జిల్లాలోనే ఆర్టీసీ డిపిటిఓ అధికారి అంటూ తన గురించి పూర్తిగా తెలియదు అంటూ తోటి ప్రయాణికుల ముందు కండక్టర్, డ్రైవర్‌పై దుర్భాషలాడుతూ గొడవకు దిగాడు. జరిగిన సంఘటనను డ్రైవర్ వీడియో తీస్తుండడంతో ఫోన్ లాక్కొని శ్రీనివాసరావు బీభత్సం డ్రైవర్‌పై దాడిచేసి గాయపరిచాడు. చీరాల ఆర్టీసీ డిపో మేనేజర్‌కు డ్రైవర్‌పై ఫిర్యాదు చేసి మీ సంగతి చూస్తా అంటూ బెదిరించసాగాడు. దాడిలో గాయపడిన డ్రైవర్ శివయ్యను హయ్యర్ బస్సు సిబ్బంది చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం అవుట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సిబ్బందిపై ప్రయాణికులు దాడి చేయడానికి ఖండిస్తూ విజయవాడ, ఒంగోలు, నరసరావుపేట, ఆర్డినరీ సుమారు 40 సర్వీసు బస్సులను నిలిపివేసి ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ ఉన్నత అధికారులు హయ్యర్ బస్సు సిబ్బందిని సున్నితంగా సముదాయించే ప్రయత్నాలు చేసినా.. తమకు న్యాయం చేయాలని కార్మికులు నిరసన కొనసాగిస్తుండడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
దాడి చేసిన శ్రీనివాసరావును అరెస్టు చేయాలి
ఆర్‌టిసి బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన శ్రీనివాసరావును పోలీసులు తక్షణమే అరెస్టు చేయాలని, సిబ్బందికి రక్షణ కల్పించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం బాపట్ల ఆర్‌ఎం చీరాల డిఎం శ్యామలతో చర్చలు జరిపారు. శ్రీనివాసరావుపై కేసు నమోదుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. దాడిచేసి గాయపరిచిన శ్రీనివాసరావు వైద్య ఖర్చులు మొత్తం భరించాలని, అందుకు ఆర్టీసీ యాజమాన్యం బాధితుడికి న్యాయం చేయాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమం సాయంత్రం వరకు జరిగింది. అనంతరం చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న డ్రైవర్ శివయ్యను సిఐటియు నాయకులు హయర్ బస్సు సిబ్బంది పరామర్శించారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ డిపో కార్యదర్శి బి శ్రీనివాసరావు, తులసిరావు, కెబికె రెడ్డి మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైయిర్ బస్సు వర్కర్స్ యూనియన్ నాయకులు ఎర్రం నాగిరెడ్డి, వి వెంకటేశ్వర్లు, టి వెంకటేష్, ఎం చందు, ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.










