ప్రజాశక్తి - సాలూరురూరల్ : విజయవాడ ఆర్‌టిసి డిపోకు చెందిన బస్ డ్రైవర్ భక్తుల రాంసింగ్‌పై ఒంగోలులో కారును పక్కకు తీయమన్నందుకు విచక్షణారహితంగా కొట్టిన 19 మందిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని సిఐటియు ఆధ్వర్యాన ఆటో వర్కర్స్ యూనియన్, ఆర్‌టిసి నాయకులు మండలంలోని మామిడిపల్లి మూడు రోడ్ల కూడలిలో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవాణా రంగంలో నిత్యం ప్రజలకు సేవ చేస్తున్న బస్, ఆటో, లారీ వివిధ రకాలుగా సేవలందిస్తున్న కార్మికులపై ఎప్పటికప్పుడు కొందరితో ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్నారని అటువంటి వారిపై కొందరూ కావాలనే కక్షపూరితంగా కొట్టడం, తిట్టడం చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. బస్సుకు అడ్డంగా కారు తీయమన్నందుకే ఒక్కడ్ని చేసి అంత మంది విచక్షణారహితంగా కొట్టడం దారుణమన్నారు. దోషులు ఎంతటి వారైనా వెంటనే వారిని శిక్షించాలని లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు, ముంగారమ్మ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జర్జాపు జ్యోతిష్య రావు, కృష్ణ, అప్పలరాజు, మహేష్, శ్రీను, ఆర్‌టిసి సిబ్బంది పాల్గొన్నారు.
సాలూరు: నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్ లపై విచక్షణా రహితంగా దాడికి నిరసనగా ఆదివారం స్థానిక ఆర్టీసీ డిపో గేట్ వద్ద జెఎసి ఆధ్వర్యాన సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. హారన్ కొట్టిన వెంటనే దారి ఇవ్వలేదనే ఆగ్రహంతో అమానుషంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేయడం దారుణమని జెఎసి నాయకులు ఎంఎస్ నారాయణ చెప్పారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు పి.సుందరరావు, ఎటి నాయుడు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
పార్వతీపురం టౌన్ : విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌పై వ్యక్తులు దాడికి నిరసనగా జిల్లా కేంద్రంలో ఆదివారం స్థానిక ఆర్టీసీ డిపోలో ఉన్న ఇయు, ఎన్‌ఎంయు, వైఎస్‌ఆర్‌సిపి సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల సభ్యులు నరసింగరావు, డిఎ నాయుడు తదితరులు మాట్లాడుతూ, రహదారిపై అడ్డుగా ఉన్న కారును తీయాలని హరన్ కొట్టి కోరగానే విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ రాంసింగ్‌పై 19 మంది వ్యక్తులు దాడి చేయడం అమానుషమని వెంటనే వారందరిని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై చర్యలు చేపట్టాలని, లేనిచో జెఎసి ఆధ్వర్యంలో ఉమ్మడి పోరాటానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు.
పాలకొండ : ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్ పై దాడి చేసినవల్ని కటినంగా శిక్షించాలని కోరుతూ ఆదివారం ఆర్టీసీ డిపో ఎదుట నల్లబ్యాడ్జీలతో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రీజియన్ కార్యదర్శి బాసురు కృష్ణమూర్తి మాట్లాడుతూ బెంగళూర్ నుంచి విజయవాడ వస్తున్న మార్గమధ్యలో కావలి వద్ద 19 మంది దుండగులు డ్రైవర్‌పై దాడి చేశారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు రక్షణ కల్పించాలన్నారు. కార్యక్రమంలో వారాడ వెంకటరమణ, బివి రమణ, ఎంఆర్ మూర్తి అన్నారు.










