రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకూ మాముళ్లు
పోలీసులతో నిర్వాహకులు బిజీబిజీగా మంతనాలు!
గుండాట, మూడు ముక్కలాటల నిర్వహణకూ ఏర్పాట్లు
నేటి నుంచి కోడి పందేల ప్రారంభానికి సర్వంసిద్ధం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
కోడిపందేల నిర్వహణకు సంబంధించి పందేల నిర్వాహకులు పోలీసులతో బిజీబిజీగా మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. భోగి రోజు నుంచి పందేలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వనుందంటూ అందుకు తగినట్లుగా నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. పోలీసుల నుంచి ఇబ్బందులు లేకుండా ముందుగానే మామూళ్లు ముట్టజెప్పి కట్టడి చేసేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. బరుల ప్రాతిపదికన మామూళ్లను నిర్ణయిస్తున్నట్లు చెబుతున్నారు. పోలీసులకు ఇచ్చే మామూళ్లు బరుల ప్రాతిపదికన నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. చిన్న బరులకైతే రూ.30 వేలు, ఓ మోస్తరు బరులకు రూ.50 వేలు, పెద్ద బరులైతే రూ.లక్ష, భారీ పందేలు నిర్వహించే బరులకైతే రూ.రెండు లక్షల వరకూ సైతం మామూళ్లు నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే మామూళ్లకు సంబంధించిన ప్రక్రియ చాలావరకూ పూర్తయినట్లు చెబుతున్నారు. ఈ మామూళ్లు కిందిస్థాయి అధికారుల నుంచి ఉన్నతస్థాయి వరకూ వెళ్లనున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రభుత్వమే అనధికారికంగా పందేలకు అనుమతి ఇవ్వనుండటంతో నిర్వాహకులు అందుకు తగినట్లుగా ముందుగానే అన్ని చర్యలూ చేపడుతున్నారు. మామూళ్లు, ఏర్పాట్లకు సంబంధించిన సొమ్ము వసూళ్లకు నిర్వాహకులు ముందుగానే ప్రణాళికలు రూపొందించుకున్నట్లు చెబుతున్నారు. గుండాట, మూడుముక్కలాట నిర్వాహకులు ఎంతివ్వాలి, ప్రతి పందేనికి సంబంధించి పందెం సొమ్ములో ఎంత శాతం కేటాయించాలనే నిర్ణయాలు ఇప్పటికే జరిగిపోయినట్లు చెబుతున్నారు. మోస్తరు బరులకు సంబంధించిన నిర్వాహకులు రూ.ఏడు నుంచి ఎనిమిది లక్షలు, పెద్దబరులు నిర్వాహకులైతే రూ.25 లక్షలు వరకూ మిగిలేలా ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. పెద్దబరుల వద్ద ఘర్షణలు చోటుచోసుకోకుండా బౌన్సర్లను సైతం రంగంలోకి దింపేందుకు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో సిద్ధం చేశారు. భోగి రోజు ఉదయం 11 గంటల వరకూ పోలీసుల హడావుడి ఉంటుందని, అక్కడ నుంచి యథేచ్ఛగా సాగే అవకాశం ఉందని నిర్వాహకులే ప్రచారం చేస్తున్నారు. పందేల్లో పోటీపడే పుంజులను ఇప్పటికే అన్నిరకాలుగా సిద్ధం చేసుకుని పందెంరాయుళ్లు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా పండుగ రోజు భారీఎత్తున పందేలు జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఆర్థిక స్థోమతను బట్టి బరుల ఎంపిక
తమ ఆర్థిక స్థోమతను బట్టి పందెంరాయుళ్లు ఏ బరిలో పందేల్లో పాల్గొవాలనే దానిపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ధనవంతులంతా భారీ పందేల వద్దకు క్యూ కట్టే పరిస్థితి ఉండగా, ఓ మోస్తరు పందేలు, అంతకంటే చిన్న పందేలు వేసేవారు తమతమ స్థోమతను బట్టి బరులను ఎంపిక చేసుకుంటున్నారు. సంక్రాంతి కోడి పందేల కోసం ఇప్పటికే అప్పులు చేసి మరీ సొమ్ము సిద్ధం చేసుకున్నట్లు చర్చ సాగుతోంది. పేకాటరాయుళ్లు సైతం పెద్దఎత్తున ఆడేందుకు తోటలు, ఊరు చివర ఇళ్లలో ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. పందేలు చూసేందుకు వెళ్లేవారు గుండాట, మూడుముక్కలాటలకు ఆకర్షణకు గురై జేబులు గుల్ల చేసుకునే పరిస్థితి ఏర్పడనుంది. గుండాటలో కూడా కనీసంగా రూ.వంద ఉండేలా నిబంధనలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే పండుగ మూడురోజులు రూ.వందల కోట్లలో బెట్టింగ్ జరగనున్నట్లు అంతా అంచనా వేస్తున్నారు.










